హోరాహోరీగా సాగిన మ్యాచ్లోపాక్ ఉత్కంఠ విజయం
సఫారీలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరవకనే ఇన్నింగ్స్ రెండో బంతికి ఓపెనర్ డికాక్ అవుటయ్యాడు. ఆ తర్వాత ఆమ్లా (38), డుప్లెసిస్ (27) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ రెండో వికెట్కు 67 పరుగులు జోడించడంతో సఫారీలు గాడిలో పడినట్టు కనిపించింది. కాగా రహత్ అలీ బౌలింగ్లో డుప్లెసిస్ అవుటవడంతో దక్షిణాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. మరుసటి ఓవర్లో ఆమ్లా వెనుదిరిగాడు. ఆ తర్వాత రోసౌ, మిల్లర్, డుమిని, స్టెయిన్ వెంటవెంటనే అవుటయ్యారు. ఆ తర్వాత డివిల్లీర్స్ ఒంటరి పోరాటం చేసి జట్టును విజయం అంచుల వరకు తీసుకెళ్లాడు. కాగా సొహైల్ ఖాన్ బౌలింగ్లో ఏబీ అవుటవడంతో సౌతాఫ్రికా ఆశలు ఆవిరయ్యాయి. ఇమ్రాన్ తాహిర్ పెవిలియన్ చేరడంతో పాక్ విజయం ఖాయమైంది. పాక్ బౌలర్లు ఇర్ఫాన్, రహత్ అలీ, రియాజ్ మూడేసి వికెట్లు తీశారు.
ప్రపంచకప్ గ్రూపు-బీలో భాగంగా శనివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిస్బా (56) హాఫ్ సెంచరీకి తోడు ఓపెనర్ సర్ఫరాజ్ (49) రాణించడం మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా పేసర్ స్టెయిన్ 3 వికెట్లు తీశాడు. సర్ఫరాజ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.