1 నుంచి రైతు పోరుబాట

ఆదిలాబాద్‌, జూలై 29 : రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గాను, ఆగస్టు 1వ తేదీ నుంచి రైతు పోరుబాట నిర్వహిస్తున్నట్లు సిపిఐ అనుబంధ సంఘమైన రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ విధానాలతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఎరువులు, విత్తనాల ధరలు పెంచి రైతులపై భారం మోపుతుందని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతులు అప్పులపాలై వాటిని తీర్చలేక ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘం ఆధ్వర్యంలో ఎనిమిది రోజుల పాటు రైతు పోరుబాట చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 9న చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని కూడాచేపడుతున్నట్టు ఆయన తెలిపారు.