11 నెలల పసివాడికి ప్రాణం పోసిన కేసీఆర్
కాలేయ మార్పిడికి రూ. 25 లక్షలు మంజూరు
హైదరాబాద్,ఆగస్టు28 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం వున్న పసివాడికి ఆర్థిక సహాయం మంజూరు చేశారు. గజ్వేల్ పట్టణానికి చెందిన హనుమాన్ దాస్ కుమారుడైన దేవసాని శ్రీమాన్ పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేయించగా కాలేయానికి సంబంధించిన సమస్య తలెత్తిందని, కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని వైద్యులు చెప్పారు. దీంతో అంత ఖర్చు భరించలేని
తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని పత్రికలలో వచ్చిన కథనాల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసుకున్నారు. వెంటనే సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డితో మాట్లాడి.. అవసరమైన వైద్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి బాలుడి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలేయ మార్పిడికి రూ.25 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి రూ. 25 లక్షలను సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేశారు. దీనికి సంబంధించిన చెక్కును సోమవారం కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా డాక్టర్లను కలెక్టర్ కోరారు.