అమెరికాలో దుండగుడి కాల్పుల కలకలం
వాషింగ్టన్,నవంబర్2(జనంసాక్షి): అమెరికా మరోమారు ఉలిక్కిపడింది. న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తేరుకోకముందే అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో మరో ఘటన చోటుచేసుకుంది. స్థానిక వాల్‌మార్ట్ స్టోర్‌లో బుధవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. దుండగుడు ఒక్కసారిగా స్టోర్‌లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఇప్పటివరకు నిందితుల గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదని థార్న్‌టన్ నగర పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దుండగుడు స్టోర్‌లోకి చొరబడి 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుధవారం న్యూయార్క్ నగరంలో ఓ దుండగుడు ట్రక్కుతో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడి జరిగిన మరుసటి రోజే మరో ఘటన చోటుచేసుకోవడంతో అమెరికా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
ఆ ఉగ్రవాదికి ఉరేయాలన్న ట్రంప్
న్యూయార్క్‌లో ట్రక్కుతో దాడి చేసి 8 మంది మృతికి కారణమైన ఉగ్రవాది సైఫుల్లో సైపోవ్‌కు మరణశిక్ష విధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఉజ్బెకిస్తాన్‌కు చెందని ఉబర్ డ్రైవర్ సైపోవ్‌ను ఉగ్రవాదిగా చిత్రీకరించిన ట్రంప్.. ఆ ఉన్మాదికి మరణశిక్ష విధించాలని తన ట్విట్టర్‌లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ముస్లిం దేశాలపై అనేక ఆంక్షలు విధించారు. ఆ దేశాల నుంచి వస్తున్న వారిని క్షుణ్ణంగా ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు. అయినా కానీ అమెరికాలో ముస్లిం తీవ్రవాదులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా ట్రంప్ తన అధికారాలను ఉపయోగించకపోయినా.. న్యూయార్క్ ఉగ్రవాదిని ఉరి తీయాలని తన ట్వీట్ ద్వారా వెల్లడించడం సంచలనమే. ఉగ్రవాది సైపోవ్ ప్రస్తుతం న్యూయార్క్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇస్లామిక్ స్టేట్ వీడియోలను వీక్షించిన తర్వాత.. ఏడాది క్రితమే ఈ
దాడి కోసం ప్లానేసినట్లు ఆ ఉగ్రవాది చెప్పాడు.