117 సర్వే నంబరు సీలింగ్ భూమిని కాపాడలేరా..!?
* రెవిన్యూ శాఖ నిర్లక్ష్యంపై అఖిలపక్షం ఆగ్రహం
జూలూరుపాడు, ఆగష్టు 25, జనంసాక్షి:
మండలం పరిధిలోని గుండెపుడి రెవెన్యూ 117 సర్వే నెంబరులోని సీలింగ్ భూమిని కాపాడటంలో రెవిన్యూ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సేకరణ చట్టం ప్రకారం ఎన్నో ఏళ్ల నాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సీలింగ్ భూమిలో కొందరు గిరిజనేతరులు అక్రమంగా పట్టాలు పొంది, ఎత్తైన గుట్టను యంత్రాలతో చదును చేస్తున్నారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన అఖిలపక్ష నాయకులు గురువారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్ మాట్లాడారు. గుండెపుడి రెవిన్యూ పరిధి 117 సర్వే నంబరులో కొందరు గిరిజనులు పట్టాలు పొంది సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు. కానీ అదే ప్రాంతంలో గిరిజనేతరులు కొందరు అక్రమంగా పట్టాలు పొందారని, అక్రమార్కులు చదును చేస్తున్నటువంటి ప్రాంతం సీలింగ్ భూమా, కాదా అనే విషయాన్ని రెవిన్యూ అధికారులు తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనేతరుల చేతిలో ఉన్న 117 సర్వే నంబరు సీలింగ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, లేదా అవి పట్టా భూములా, సీలింగ్ భూమినా అనే విషయాన్ని రెవిన్యూ అధికారులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతంలో భార్యాపిల్లలతో జీవనం సాగించేందుకు ఏళ్ల నాటి నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని, కానీ ప్రభుత్వ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఎత్తైన గుట్టను తవ్వి చదును చేస్తుంటే రెవిన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవిన్యూ శాఖ తక్షణమే స్పందించని పక్షంలో సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి రెవిన్యూ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరికి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం మండల నాయకులు మధు, గడిదేసి కనకరత్నం, లకావత్ శ్రీను, చాంద్ పాషా, గార్లపాటి వెంకటి, వల్లమల చందర్రావు, పగడాల అఖిల్, బానోతు మధు, బొల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.