12 నుంచి నామినేషన్ల స్వీకరణ
దివ్యాంగుల ఓటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఆదిలాబాద్,నవంబర్10(జనంసాక్షి): ఈనెల 12 నుంచి నామినేషన్ల స్వీకరణ పక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. రిటర్నింగు అధికారులు కార్యాలయ పనిదినాల్లో ఉదయం 11 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారు. అభ్యర్థిని బలపర్చే వ్యక్తి అదే నియోజకవర్గానికి చెందిన వారై,ఓటు హక్కు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ఒకరు, అదే గుర్తింపు లేని పార్టీతో సహా స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది బలపర్చాల్సి ఉంటుందని ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు. నామినేషన్ల సమర్పణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా రిటర్నింగు అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. నామినేషన్ సమర్పించే అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ కింద జనరల్ అభ్యర్థి
రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5వేలు చెల్లించాలన్నారు. ఒక్కో అభ్యర్థి మూడు నామినేషన్లు సమర్పించవచ్చని తెలిపారు. అభ్యర్థికి తన నేరచరితకు సంబంధించి మూడుసార్లు ప్రముఖ దినపత్రికలు, ఛానళ్లకు సుప్రీం ఆదేశాల మేరకు ప్రకటనలు ఇవ్వాలని సూచించారు. నామినేషన్ దాఖలు మొదలుకొని పోలింగు తేదీకి ముందు రోజు వరకు తమ చరితను వెల్లడించాలని తెలిపారు. అభ్యర్థులు ఎన్నికల నియామవళి ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవైనా ఫిర్యాదులు ఉంటే రిటర్నింగు అధికారుల దృష్టికి తీసుకరావచ్చని, అనుమతిలేకుండా ర్యాలీలు, సభలు
పెట్టకూడదని స్పష్టంచేశారు. ఇకపోతే దివ్యాంగ ఓటర్లకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ సాధించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో దివ్యాంగులు, గర్భిణులు, బాలింతల పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉందని గుర్తించిన అధికారులు ఈ సారి వారినే లక్ష్యంగా చేసుకున్నారు. అన్ని మండలాల్లో ఎంత మంది దివ్యాంగులు, ఎంత మంది గర్భిణులు ఉన్నారో లెక్కగట్టారు. దివ్యాంగుల విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణంతో పాటు జిల్లాలోని 13 మండలాల పరిధిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేశారు. కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు.