12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
– టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ నిలిబెట్టుకోవాలి
– ఒత్తిడి పెంచే పోరులో ప్రతిపక్షపార్టీలు కలిసిరావాలి
– టీఆర్‌సీ చర్చవేదికలో వక్తలు
హైదరాబాద్,జులై4(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో తెలంగాణ వ్యాప్తంగా గొ ప్ప ప్రజా ఉద్యమం తప్పదని టీఆర్‌సీీ ఆధ్వర్యంలో ఏర్పటైన చర్చా వేదికలో పాల్గొన్న వక్తలు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులకు ముస్లిం సంక్షేమాన్ని పరిమితం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితుల కన్న ముస్లింలు వెనుకబడి ఉన్నారని, వారి సంక్షేమం కోసం ఉద్యోగ నియామకాల్లో 12 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని హామీ అమలయ్యే వరకు నిర్విరామ పోరాటానికి ముస్లిం సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ తెలంగాణ అధ్యక్షుడు మహ్మద్ ఖాన్, ఎంపీజే అధ్యక్షుడు ఖాజా మొహినోద్దిన్, సియాసిత్ పత్రిక అధ్యక్షుడు జహరాలీ ఖాన్, ఖలీల్ రసూల్ ఖాన్, హెచ్‌ఎంపీడీ చైర్మన్ వేద కుమార్ తదితరులు పాల్గొన్నారు.