రేషన్ షాపుల ద్వారా…12 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా అందిచాలి

బోధన్, (జనంసాక్షి) : పాలకులు ధరల మీద ధరలు పెంచుతూ పోతున్నారని, దానితో పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఏం వండుకోవాలో ఏం తినాలో తోచని పరిస్థితి ఏర్పడిందని కావున సివిల్ సప్లై అధికారులు రేషన్ షాపుల ద్వారా 12 రకాల నిత్యవసర సరుకులను ఉచితంగా అందివ్వాలని ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు బోధన్ పట్టణంలో ప్రగతిశీల మహిళా సంఘం (పి ఓ డబ్ల్యు) బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, సబ్ కలెక్టర్ గారికి డిమాండ్లతో కూడిన వినతి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించిదని దాన్ని చూసి పేదలకు భూములు ఇండ్ల స్థలాలు, కొలువులు, ఇండ్లు, రేషన్ కార్డులు తదితర సమస్యలు సమస్య పోతాయని ప్రజలు ఎంతో ఆశపడ్డారని కానీ ఆయన అనుచరులకు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే, ధరలను తగ్గించి అదుపులో ఉంచుతామని మోడీ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక ధరల మీద ధరలను పెంచుతూ పక్షం రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచారని దానితో రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఇకపోతే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను 1200 కు పెంచి సబ్సిడీలను ఎత్తివేసారని మోడీ ప్రభుత్వం కాకులను కొట్టి గద్దలకే సినట్లుగా పేదలను కొట్టి అతిపెద్ద కుబేరులైన ఆదాని అంబానీలకు లక్షల కోట్లు దోచిపెడుతుందని తీవ్రంగా విమర్శించారు. పెరుగుతున్న ధరల మూలంగా పేదల బతుకులు దినదిన గండంగా మారిందని అందుకే రేషన్ షాపుల ద్వారా 12 రకాల నిత్యవసర సరుకులను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా నాయకురాలు బీపాషా బేగం, బి. గంగమణి, టి.అనిత, బి. అబ్బవ్వ, సి.హెచ్. లక్ష్మి, శాంత, ఎల్. గంగామణి, పోషవ్వ  పాల్గొన్నారు.

తాజావార్తలు