రష్యాలో 13 మంది ఆర్థిక నేరస్థుల విడుదల

మాస్కో,(జనంసాక్షి): దేశంలో వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడిన 13 మంది నేరస్థులను క్షమాభిక్ష కింద విడుదల చేస్తున్నట్లు రష్యా దేశాధ్యక్షుడు అధికార ప్రతినిధి బోరిస్‌ టిటోవ్‌ బుధవారం మాస్కోలో వెల్లడించారు. కాగా వారిలో 8 మంది విచారణ కింద జైలులో ఉన్నారని తెలిపారు. మరో ఐదుగురు జైలుశిక్ష పడి ఖైధీలుగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నెల మొదటి వారంలో దేశంలోని వేలాది మంది ఆర్థిక నేరగాళ్లు తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని దిగువ సభ డ్యూమాకు దరఖాస్తు చేసుకున్న సంగతిని ఆయన ఆ సందర్భంగా గుర్తు చేశారు.

అయితే వారి క్షమాభిక్ష విషయమై ఎగువ సభ ఆరు నెలల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో  మొట్టమొదటిసారిగా ఆర్థిక నేరం చేసిన వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తామని , అలాంటివారు దాదాపు మూడు వేలమంది జైళ్లలో ఉన్నారని బోరిస్‌ టిటొవ్‌ పేర్కొన్నారు.