130స్థానాలతో..  మళ్లీ అధికారంలోకి వస్తాం

– ఏ ఫర్‌ అమరావతి.. పీ ఫర్‌ పోలవరం
– పోలవరం పనులు చకచకా పూర్తవుతుంటే కేవీపీ డబ్బా కొట్టుకుంటున్నారు
– రాయలసీమ ద్రోహిగా జగన్‌ మారారు
– ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
విజయవాడ, మే21(జ‌నంసాక్షి) : ఏపీలో తెదేపానే మళ్లీ అధికారంలోకి రాబోతుందని, 23న ఫలితాల్లో 130 స్థానాలకు పైగా తెదేపా అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని, తద్వారా మరోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వెయ్యిశాతం గెలుస్తుందని ధీమాగా చెప్పగలిగింది టీడీపీనే అన్నారు. 40రోజుల్లో అభ్యర్థులతో మాట్లాడే సాహసంకూడా జగన్మోహన్‌ రెడ్డి చేయలేదని విమర్శించారు. పోలవరం పనులను చకచకా పూర్తిచేస్తుంటే కేవీపీ రామచంద్రరావు డబ్బా కొట్టుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అరాచకశక్తులు రాజ్యాధికారం కాంక్షిస్తున్నాయని ఆరోపించారు. ఏ ఫర్‌ అమరావతి..పీ ఫర్‌ పోలవరం అని దేవినేని అభివర్ణించారు. కేసీఆర్‌ ఇచ్చిన రూ.1200 కోట్లకి కక్కుర్తి పడి రాయలసీమ ద్రోహిగా మారారని విమర్శించారు. ప్రశాంత్‌ కిషోర్‌ బిహార్‌ ముఠా అని, ఫలితాలు వచ్చాక కుట్రలు బయటకు వస్తాయని, ప్రశాంత్‌ కిషోర్‌, జగన్‌, విజయసాయిరెడ్డి విూడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమది మహిళా ప్రభంజనం అని దేవినేని ఉమ అన్నారు. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎన్ని చేసినా.. ఫలితం ఉండదనే సూత్రాన్ని ఇప్పటికైనా జగన్‌ తెలుసుకోవాలన్నారు. అమరావతిని భ్రమరావతి అన్న జగన్‌ తానే భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తమకు అనుకూలంగా వచ్చాయన్న మోదీ, అమిత్‌ షాకు కనువిప్పు కలుగుతుందని ఉమా అన్నారు.