130 బస్సులు సిద్ధంగా ఉన్నట్లు రష్యా రక్షణశాఖ
మాస్కో: ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్ పట్టణాన్ని రష్యా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ నగరంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వారితో పాటు ఇతర దేశస్థులు కూడా ఉన్నారు. ఖార్కీవ్, సుమే ప్రాంతంలో ఉన్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు 130 బస్సులు సిద్ధంగా ఉన్నట్లు రష్యా రక్షణశాఖ కంట్రోల్ సెంటర్ తెలిపింది. ఆ విద్యార్థులను రష్యాలోని బెల్గోరాడ్ ప్రాంతానికి తరలించనున్నట్లు కల్నల్ జనరల్ మిఖేయిల్ మిజిన్‌సేవ్ తెలిపారు. ఖార్కీవ్‌లోని రైల్వే స్టేషన్‌లో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు బంధీ అయి ఉన్నట్లు నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిన విషయం తెలిసిందే. ఫైరింగ్ వల్ల ఖార్కీవ్ నుంచి విద్యార్థుల తరలింపు ఆగినట్లు ఇండియా పేర్కొన్న తర్వాత పుతిన్ నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం రష్యా సెక్యూర్టీ కౌన్సిల్‌లో మాట్లాడిన పుతిన్.. 3179 మంది భారతీయుల్ని బంధీలుగా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఖార్కీవ్‌లో విద్యార్ధులు చిక్కుకున్న విషయంపై పుతిన్‌తో బుధవారం ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే.