15 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ టీకాలు
దిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి): దేశంలో 15`18 ఏళ్ల వారికి కరోనా టీకాలు అందించేందుకు కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందుకోసం నూతన సంవత్సరం(జనవరి 1) నుంచి పిల్లలకు కొవిన్ యాప్/వెబ్‌సైట్‌లో టీకా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సోమవారం వెల్లడిరచింది. జనవరి 3వ తేదీ నుంచి డోసుల పంపిణీ చేపట్టనున్నారు. మరి పిల్లలకు టీకా కోసం ఎలా నమోదు చేసుకోవాలి అంటే..గతంలో పెద్దల కోసం కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారో.. పిల్లలకు కూడా అలాగే చేసుకోవాలి. అయితే కుటుంబసభ్యుల ఫోన్ నంబరుతో లాగిన్ అయి నమోదు చేసుకోవచ్చు లేదా సెపరేట్‌గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది. లేదంటే సవిూప వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే వాక్`ఇన్ రిజిస్ట్రేషన్ రాష్ట్రాల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
కొవిన్ యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్ నంబరును ఎంటర్ చేయాలి. అప్పుడు విూ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో విూ నంబరును వెరిఫై చేయాలి.ఒక మొబైల్ నంబరుపై నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.(ఉదాహరణకు, గతంలో తల్లిదండ్రులిద్దరూ కొవిన్ యాప్‌లో రిజిస్టరైన నంబరుతో వారి పిల్లల(15`18ఏళ్ల మధ్య వారైతేనే) పేర్లు కూడా నమోదు చేసుకోవచ్చు.) నంబరు వెరిఫై అయిన తర్వాత రిజిస్ట్రేషన్ పేజీ వస్తుంది. అందులో పేరు, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలను ఎంటర్ చేయాలి. పిల్లలకు పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటివి ఉండవు కాబట్టి.. ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ నంబరును ఎంచుకోవాలి. ఒకవేళ ఆధార్ నంబరు ఇంకా తీసుకోని పిల్లలకు వారి పదో తరగతి స్టూడెంట్ ఐడీ నంబరును నమోదు చేయవచ్చు.ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ బటన్ కన్పిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేసి వ్యాక్సినేషన్‌కు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 15`18ఏళ్ల వారికి కొవాగ్జిన్ టీకా ఒకటే అందుబాటులో ఉంది. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్`డి టీకాను కూడా 12ఏళ్ల పైబడిన వారికి ఇచ్చేందుకు అనుమతి లభించింది. అయితే జైకోవ్`డి టీకా పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ టీకా పంపిణీ మొదలుపెట్టిన తొలుత పెద్దలకు మాత్రమే ఇవ్వనున్నట్లు సమాచారం.