15 నుంచి ఢిల్లీలో రెండో దఫా సరి, బేసి

6న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరుకొన్న కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం రెండో దఫా సరి,బేసి విధానాన్ని ఈ నెల 15 తిరిగి ప్రారంభించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ విధానం అమల్లో ఉండగా ఒక దిశలో వెళ్లే ప్రయాణికులు .. ఆ దిశలో నడిచే వాహనాల్లో ప్రయాణించే (కార్‌పూలింగ్) విధంగా పూచో కార్‌పూల్ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొన్న తర్వాత 5 కిలోమీటర్ల లోపు ప్రయాణించడానికి కార్‌పూలింగ్ ఆప్షన్లను వినియోగించుకోవచ్చని, అందుకు వారు తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్‌రాయ్ తెలిపారు. సరి సంఖ్య వాహనముండే వ్యక్తులు.. బేసి రోజున .. బేసి సంఖ్య ఉండే వాహనాలను యాప్‌లో వెతికే విధంగా వెసులుబాటును కల్పించారు. పాఠశాలల నుంచి 12 ఏండ్లలోపు విద్యార్థులను తీసుకొచ్చే తల్లిదండ్రులకు సరి, బేసి విధానం నుంచి మినహాయింపు ఇచ్చామని మంత్రి రాయ్ పేర్కొన్నారు.