1500 మిలిటెంట్లను చంపేశాం

` ఇజ్రాయెల్‌ ప్రకటన
` యుద్ధం మేం మొదలుపెట్టలేదు కానీ.. ముగిస్తాం..
` భారత్‌ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిచింది
` ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు
` ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నెతన్యాహు ఫోన్‌
` ఇజ్రాయిల్‌పై దాడిలో మా ప్రమేయం లేదు
` ఇరాన్‌ సుప్రీం లీడర్‌ కీలక వ్యాఖ్యలు
` దాడులతో ఇజ్రాయెల్‌, పాలస్తీనీ ఉక్కిరిబిక్కిరి..
` ఇరువైపులా దాడుల్లో సుమారు 1600 మంది, వేలల్లో క్షతగాత్రులు
టెల్‌ అవీవ్‌(జనంసాక్షి):ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు.  తమ దేశంపై దాడి చేసి హమాస్‌ చారిత్రక తప్పిదం చేసిందని ఆయన అన్నారు. యుద్దాన్ని ఇజ్రాయెల్‌ మొదలుపెట్టలేదు కానీ.. ముగింపునిస్తుంది అంటూ ఆయన నేరుగా హమాస్‌ను హెచ్చరించారు. హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి నెతన్యాహు మాట్లాడారు. ‘ప్రస్తుతం దేశం యుద్ధం చేస్తోంది. దీన్ని మేం ఏ మాత్రం కోరుకోలేదు. కానీ, తప్పని పరిస్థితుల్లో, దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో యుద్ధం చేయాల్సి వస్తోంది. మేం దీన్ని మొదలుపెట్టాలని కోరుకోలేదు. కానీ, ముగించేది మాత్రం ఇజ్రాయెలే‘అని తెలిపారు. ఇజ్రాయెల్‌పై దాడి చేసి హమాస్‌ చారిత్రక తప్పిదం చేసిందన్నారు.
ªూ ప్రతిదాడి హమాస్‌తోపాటు, ఇజ్రాయెల్‌ శత్రు దేశాలకు దశాబ్దాలపాటు గుర్తుండిపోతుందని నెతన్యాహు హెచ్చరించారు. హమాస్‌ కూడా ఐసిస్‌ లాంటి ఉగ్రవాద సంస్థే అని.. ప్రజలంతా ఏకమై దాన్ని ఓడిరచాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌ కేవలం తమ ప్రజల కోసమే పోరాటం చేయట్లేదని.. ఇలాంటి హింసకు, అనాగరికతకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి దేశం కోసం పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ గెలిస్తే నాగరిక ప్రపంచం మొత్తం గెలిచినట్లేనన్నారు. ఇజ్రాయెల్‌ సైన్యం మునుపెన్నడూ లేనివిధంగా హమాస్‌పై దాడి చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా తమ దేశానికి మద్ధతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు.
భారతదేశం ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది
ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం 4వ రోజుకు చేరింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపుగా 1600 మంది మృత్యువాతపడగా.. వేలమంది గాయాల బారినపడ్డారు. ఇదిలా ఉంటే.. ఇజ్రాయిల్‌పై హమాస్‌ టెర్రర్‌ గ్రూప్‌ చేస్తున్న దాడులను ఖండిస్తూ.. ఆ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలోనే భారతదేశం కూడా ఇజ్రాయిల్‌కు తమ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడ నెలకొన్న పరిస్థితులను ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహును అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బెంజమిన్‌ నెతన్యాహుతో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్‌ చేసి మాట్లాడారు.. హమాస్‌ టెర్రర్‌ గ్రూప్‌తో జరుగుతోన్న యుద్ధంపై, ఇజ్రాయిల్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు. ‘ప్రధాని నెతన్యాహుతో ఫోన్‌ కాల్‌లో మాట్లాడాను. ఇజ్రాయిల్‌-హమాస్‌ టెర్రర్‌ గ్రూప్‌ మధ్య జరుగుతున్న యుద్ధం, అక్కడ నెలకొన్న పరిస్థితులను నెతన్యాహు తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచి ఉన్నారు. భారతదేశం అన్ని రూపాల్లోనూ ఉగ్రవాదాన్ని నిస్సందేహంగా, తీవ్రంగా ఖండిస్తుంది’ అని ప్రధాని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. శనివారం ఇజ్రాయిల్‌పై హమాస్‌ చేసిన మెరుపు దాడి అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయిల్‌ ప్రధానితో ఫోన్‌ కాల్‌లో సంభాషించారు. ఆ దాడిలో ఎంతోమంది ప్రజలు చనిపోవడం తనను బాధకు గురి చేసిందని.. ఇజ్రాయిల్‌కి అండగా ఉంటామని పేర్కొన్న విషయం తెలిసిందే.మరోవైపు తమ దేశంలో చొరబడి ఘర్షణలకు పాల్పడుతున్న హమాస్‌ మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు ఇజ్రాయిల్‌ సైన్యం భీకరంగా పోరాడుతోంది. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లోని హామాస్‌ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తోంది. అలాగే ఇప్పటికే ఇజ్రాయిల్‌ భూభాగంలోకి ఎంటరైన 1500 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు ఇజ్రాయిల్‌ సైన్యం వెల్లడిరచింది. ఇక ఈ యుద్ధం నేపధ్యంలో తన దేశ ప్రజలను ఉద్దేశించిన నెతన్యాహు.. ‘తమ దేశంపై దాడికి దిగి.. హమాస్‌ తప్పు చేసిందని.. అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ యుద్ధం మొదలుపెట్టింది హమాస్‌ అని.. కానీ ముగించేది మాత్రం తామేనని’ అన్నారు.
రాత్రికి రాత్రే గాజాలో 200 మిలిటెంట్‌ స్థావరాలపై దాడిచేసిన ఇజ్రాయెల్‌ సైన్యం
హమాస్‌ దాడులతో ఇజ్రాయెల్‌ ఉక్కిరిబిక్కిరి.. వ్యవసాయ పొలంలో 100 మృతదేహాలు లభ్యం
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ దాడులతో ఇజ్రాయెల్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాలూ దద్దరిల్లుతున్నాయి. తమ దేశంపై హమాస్‌ చేపట్టిన దాడులను ఇజ్రాయెల్‌ ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా మిలిటెంట్ల పాలనలో ఉన్న గాజా పై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రాత్రికి రాత్రే గాజాలోని 200 మిలిటెంట్‌ స్థావరాలపై దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ తాజాగా ప్రకటించింది.‘గాజాలోని 200 మిలిటెంట్‌ స్థావరాలపై నిన్న రాత్రి దాడులు చేశాం. మిలిటెంట్లు ఆయుధాలు దాచిన ఓ ప్రార్థనా మందిరం, ఒక అపార్ట్‌మెంట్‌ భవనాన్ని కూడా కూల్చేశాం. పలు సైనిక లక్ష్యాలను కూడా ధ్వంసం చేశాం’ అని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ వెల్లడిరచింది. మరోవైపు పాలస్తీనా వాసులు గాజాను తక్షణమే ఖాళీ చేసి అక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం సూచించింది. హమాస్‌ దాడులతో ఇజ్రాయెల్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాలూ దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో రెండు వైపులా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగతోంది. ఇప్పటి వరకూ రెండు వైపులా 1,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు వేల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌ దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు. ఇక హమాస్‌ దాడి కారణంగా ఇజ్రాయెల్‌లో కనీసం 900 మంది మరణించారు. 2,600 మంది గాయపడ్డారు. బందీలుగా ఉన్న 100 మంది ఇజ్రాయెల్‌ పౌరుల మృతదేహాలు ఓ వ్యవసాయ పొలంలో లభించాయి.మరోవైపు హమాస్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ ఘాటు హెచ్చరికలు చేశారు. హమాస్‌ ఉగ్రవాద సంస్థ రహస్య స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. తమపై దాడితో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ చారిత్రక తప్పిదానికి పాల్పడిరదని అన్నారు. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మంగళవారం మాట్లాడారు. యుద్ధం తాము ప్రారంభించలేదని తెలిపారు. కానీ, ఈ యుద్ధాన్ని మాత్రం తామే ముగిస్తామంటూ హమాస్‌కు గట్టిహెచ్చరికలు చేశారు.
ఇజ్రాయిల్‌పై దాడిలో మా ప్రమేయం లేదు: ఇరాన్‌ సుప్రీం లీడర్‌
ఇజ్రాయిల్‌పై హమాస్‌ ఉగ్రవాదుల దాడి భీకర యుద్ధానికి దారి తీసింది. శనివారం తెల్లవారుజామున హమాస్‌ మిలిటెంట్లు గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్‌ పైకి రాకెట్లతో దాడి జరిపారు. ఇజ్రాయిల్‌ ఇంటెలిజెన్స్‌ ని ఏమార్చి సరిహద్దులు దాటి ఇజ్రాయిల్‌ పౌరులను చంపారు. పలువురిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ యుద్ధంలో 1600 మంది చనిపోయారు. ఇరువైపులా ప్రాణనష్టం భారీగా ఉంది. ఇప్పటికే హమాస్‌ జరిపిన దాడిలో 900 మంది ఇజ్రాయిలీ పౌరులు చనిపోగా.. గాజాలో 700 మంది ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో మరణించారు. ఇదిలా ఉంటే హమాస్‌ వెనక ఇరాన్‌ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇరాన్‌ సుప్రీంలీడర్‌ సలహాదారు హమాస్‌ దాడిని స్వాగతించారు. ఈ దాడిని చూస్తే గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. హమాస్‌కి చెందిన ఉగ్రనాయకులు కూడా ఈ దాడికి ఇరాన్‌ సహకరించిందనే వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఆరోపణల్ని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మంగళవారం ఖండిరచారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ కి మద్దతుగా ఉన్నప్పటికీ.. ఈ దాడిలో ఇరాన్‌ ప్రమేయం లేదని, కావాలనే ఇజ్రాయిల్‌ ఇలాంటి తప్పుడు ఆరోపణల్ని తీసుకువస్తోందని మిలిటరీ అకాడమీ వద్ద చేసిన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.మేము పాలస్తీనాను సమర్థిస్తాం, పోరాటాలను సమర్థిస్తాం, మొత్తం ఇస్లామిక్‌ ప్రపంచం పాలస్తీనియన్లకు మద్దతు ఇవ్వాలని ఖమేనీ కోరారు. ఇజ్రాయిల్‌ సైనిక, ఇంటెలిజెన్స్‌ రెండిరటిలోనూ కోలుకోలేని వైఫల్యాన్ని చవిచూసిందని అన్నారు. మరోవైపు హమాస్‌ కి మద్దతుగా లెబనాన్‌ నుంచి ఇజ్రాయిల్‌ పైకి హిజ్బుల్లా మిలిటెంట్‌ సంస్థ దాడులు చేస్తోంది. ఈ సంస్థకు కూడా ఇరాన్‌ నుంచి బలమైన మద్దతు ఉంది.