18న బలపరీక్ష

– అసెంబ్లీలో ప్రకటించిన కర్ణాటక స్పీకర్‌ రమేష్‌కుమార్‌

– వెంటనే బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టిన బీజేపీ

– సుప్రీంకోర్టు తీర్పు తరువాత నిర్వహిస్తామన్న స్పీకర్‌

– నేడు వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పు

– చివరిదశకు చేరుకున్న కర్ణాటక సంక్షోభం

బెంగళూరు,జులై 15(జనంసాక్షి): కర్ణాటక సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. ఈనెల 18న సంకీర్ణ ప్రభుత్వంపై బలపరీక్ష నిర్వహించనున్నట్లు స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ప్రకటించారు. 18న ఉదయం 11 గంటలకు విధానసభలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు అసెంబ్లీలో భారతీయ జనతాపార్టీ నేతలు జేడీఎస్‌ – కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన నోటీసును స్పీకర్‌కు సమర్పించింది. కాగా స్పీకర్‌ 18న అవిశ్వాస పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై రాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని, శాసనసభలో విశ్వాసపరీక్షకు సిద్ధంగా ఉన్నానని గత శుక్రవారం సీఎం కుమారస్వామి స్వయంగా ప్రకటించడంతో కర్ణాటక రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఇదిలా ఉండగా.. స్వయంగా కుమారస్వామే బలపరీక్షను ఎదుర్కొంటానని చెప్పడంతో సోమవారమే విశ్వాస పరీక్ష పెట్టాలని భాజపా పట్టుబట్టింది. అయితే ఇందుకు స్పీకర్‌ నిరాకరించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం సుప్రీం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆ తర్వాతే బలపరీక్ష పెడతామని, అందుకు అధికార పక్షం సిద్ధంగా ఉండాలని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. స్పీకర్‌ నిర్ణయం పట్ల భాజపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు కంటే ముందే బలపరీక్ష పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్లకార్డులు చేతబట్టి శాసనసభలో నిరసన తెలిపారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొనడంతో స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధ రామయ్య మాట్లాడుతూ గురువారం తమ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోనుందని చెప్పారు. కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలు ఆమోదించాలని సుప్రీంకోర్టు రేపు తీర్పు వెల్లడిస్తే.. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కి తగ్గుతుంది. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 105 అవుతుంది. శాసనసభలో భాజపా సంఖ్యా బలం 107(ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి). రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణ ప్రభుత్వ సంఖ్యా బలం 101(స్పీకర్‌తో కలిపి). ఇలాంటి సమయంలో విశ్వాస పరీక్షలో కుమారస్వామి నెగ్గడం దాదాపు అసాధ్యంగానే కన్పిస్తోంది.