18 మంది విద్యార్థులకు భోజనం ఇదా
ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎంపిడివో విజయలక్ష్మి
కందుకూరు , జూలై 28 : 18 మంది విద్యార్థులకు ఈ భోజనం సరిపోతుందా అని ఎంపిడివో విజయలక్ష్మి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మండలంలోని కాగుటూరు గ్రామంలో గల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలను శుక్రవారం ఎంపిడివో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలును ఆమె పరిశీలించారు. అదే విధంగా విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న భోజనం, సాంబారు నాణ్యతను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా రెండు కేజీల అన్నం చిన్నపాత్రలో సాంబారును చూసి ఆశ్చర్యానికి లోనైన ఎంపిడిఓ ్పధానోపాధ్యాయులు, కుకింగ్ ఏజెంట్లు పలు వివరాలకై ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ విధమైన పొరపాటు జరిగితే సహించేది లేదని విద్యార్థుల కడుపులు కొట్టవద్దని హెచ్చరించారు. అనంతరం విద్యార్థుల వ్యక్తిగత సామర్ద్యాన్ని మేథోసంపత్తిని ఎంపిడివో పరిశీలించారు. ఈ పరిశీలనలో ఎంపిడివోతో పాటు ఇవోఆర్‌డి రత్నజ్యోతి, కార్యదర్శి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.