18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయాలి
మహబూబాబాద్ బ్యూరో-జూలై (జనంసాక్షి)
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సి.ఈ. ఓ. వికాస్ రాజ్ హైదరాబాద్ నుండి ఓటర్ ధృవీకరణ, ఓటర్ జాబితా తయారీ, గరుడ యాప్ వంటి పలు అంశాల పై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశం నుండి అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో సమావేశం ద్వారా వికాస్ రాజ్ మాట్లాడుతూ, గతంలో ఓటర్ల నమోదుకు జనవరి ఒకటవ తేదీ మాత్రమే ప్రమాణికంగా తీసుకొనేవారని, ఈ సంవత్సరం నుంచి జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను సైతం ప్రామాణికంగా తీసుకుంటూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా నమోదు ప్రక్రియ పై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 4 నుంచి అక్టోబర్ 24 వరకు ప్రీ రివిజన్ నిర్వహించి, నవంబర్ 9 న ముసాయదా ఒటరు జాబితా విడుదల చేయాలని, డిసెంబర్ 8 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వికరించాలని, రెండు శనివారాలు, ఆదివారాలు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని, డిసెంబర్ 26 లోగా అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, 2023 జనవరి 5 న తుది ఓటరు జాబితా రుపోందించాలని తెలిపారు. ఓటరు నమోదు కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ప్రత్యేక కార్యక్రమాలు రుపొందించి అమలు చేయాలని సూచించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని , స్విప్ కార్యక్రమాల నిర్వహణ పట్ల జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎన్నికల కమిషన్ ఫారం 6, ఫారం 7, ఫారం 6బీ, ఫారం 8 నూతనంగా ప్రారంభించిందని, ఫారం 8ఏ రద్దు చేసిందని, ఫారం 6 లో నూతన ఓటర్ నమోదు మాత్రమే ఉంటుందని, ప్రతి బూత్ స్థాయి అధికారి వద్ద నూతన ఫారంలు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ వీడియో సమావేశంలో ఆర్డీవోలు కొమురయ్య, ఎల్. రమేష్, రాం ప్రసాద్, ఎలక్షన్ డి.టి.లు, కలెక్టరేట్ ఎలక్షన్ సెక్షన్ అధికారులు అనురాధ, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.