19 ఏళ్లకే రూ.100 కోట్లు.. సంపాదించాడు.

భారత సంతతి యువకుడి ఘనత
లండన్‌: భారత సంతతికి చెందిన అక్షయ్‌ రూపారెలియా(19) అత్యంత పిన్నవయసులో బ్రిటన్‌ కోటీశ్వరులైన వారిలో ఒకరిగా నిలిచారు. కేవలం 16 నెలల్లోనే తన వ్యాపారాన్ని (ఆన్‌లైన్‌ స్థిరాస్తి సంస్థ) 12 మిలియన్‌ పౌండ్ల (రూ. 103 కోట్లకు పైగా)కు చేర్చడం ద్వారా ఈ ఘనతను సాధించారు. బంధువుల నుంచి అప్పుగా తెచ్చిన 7 వేల పౌండ్లే (సుమారు రూ. 6.02 లక్షలు) అతని పెట్టుబడి. ‘డోర్‌స్టెప్స్‌.కో.యూకే’ వెబ్‌సైట్‌ ద్వారా తనది యూకేలో 18వ అతిపెద్ద స్థిరాస్తి సంస్థగా నిలబెట్టారు. విద్యార్థిగా ఉంటూ సంస్థను ప్రారంభించి అభివృద్ధి చేశారు. యూకేలో స్వయంఉపాధి సాధిస్తున్న తల్లుల నుంచి స్థిరాస్తి సమాచారాన్ని తీసుకోవడం అనేది అతని వ్యాపార ఆలోచనల్లో కీలకం. ఇంతవరకూ తాను 100 మిలియన్‌ పౌండ్ల (దాదాపు రూ. 860 కోట్లు) స్థిరాస్తులను విక్రయించినట్లు అక్షయ్‌ తెలిపారు. ఆర్థిక, గణిత శాస్త్రాల్లో చదువుకోవడానికి ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి అవకాశం వచ్చినప్పటికీ అక్షయ్‌ తన వ్యాపారాన్ని విస్తరించడానికే నిర్ణయించుకున్నారు.