19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు

తమిళనాడులో ఆసక్తికరంగా రాజకీయాలు

చెన్నై,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): తమిళనాడులో రాజకీయ మరో మలుపు తిరిగింది. దినకరన్‌ మద్దతు దారులైన 19 మంది ఎమ్మెల్యేలకు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ శుక్రవారం నోటీసులిచ్చారు. సెప్టెంబర్‌ 5లోగా తమ వైఖరిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న అభ్యర్థనపై 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులివ్వడం ఇది రెండోసారి. అన్నాడీఎంకేలోని పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాల విలీనం పట్ల తాము అసంతృప్తిగా ఉన్నామని, ముఖ్యమంత్రికి తాము మద్దతు ఉపసంహరించుకుంటున్నామని పేర్కొంటూ 19 మంది దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు ఇటీవల గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు మెమొరాండం సమర్పించిన సంగతి విదితమే. శశికళ, దినకరన్‌ వర్గీయులైన ఈ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం పుదుచ్చేరి రిసార్ట్‌లో బస చేస్తున్నారు. పళనిస్వామి అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని, దినకరన్‌ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు.