19, 20వ తేదీల్లో సైన్స్‌ ఫెయిర్‌

24-26 తేదీల్లో సిద్దిపేటలో రాష్ట్రస్థాయి ఫెయిర్‌

ఆదిలాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఈనెల 19, 20వ తేదీల్లో సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రవీందర్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సైన్స్‌ ఫెయిర్‌లో ఏడు అంశాలైన సేంద్రియ వ్యవసాయం, ఆరోగ్యం- పరిశుభ్రత, వనరుల నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, రవాణా సమాచార రంగం, గణిత నమూనాలు, విద్యార్థుల్లో ఆసక్తి ఉన్న కొత్త అంశాల ప్రదర్శనలతో పాటు మొత్తం 800 నుంచి 900 ప్రదర్శనలు ఉంటాయన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్‌ ఫెయిర్‌ ప్రదర్శనలను త్వరలో డివిజన్ల వారీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా స్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో ఎంపికైన విద్యార్థులు ఈనెల 24-26 తేదీల్లో సిద్దిపేట జిల్లాలో రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెయిర్‌ పోటీల్లో పాల్గొంటారని డీఈవో స్పష్టం చేశారు. డివిజన్ల వారీగా వీటిని నిర్వహిస్తే విద్యార్థులు కూడా ఆసక్తిగా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యా యులు, సంబంధిత ఉపాధ్యాయులు కలిసి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి మూడు అంశాలకు చెందిన ప్రదర్శనలు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇచ్చోడ జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో వీటిని ఏర్పాటు చేశారు.. ప్రతి ఏటా ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈ ప్రదర్శనలు నిర్వహించే వారు. అయితే ప్రస్తుతం కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ ఆదేశాల మేరకు ఇచ్చోడ జడ్పీ సెకండరీ పాఠశాలలో నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శల సందర్భంగా సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శన పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.