బాలల హక్కుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
-బాలల హక్కుల పరిరక్షణ లో గ్రామ కమిటీ లు కీలక పాత్ర:
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి
నల్గొండ బ్యూరో, జనం సాక్షి
బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రం లో
లక్ష్మి గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బాలల హక్కుల రక్షణ – చట్టాల పై గ్రామ,మండల,జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటి ల చైర్ పర్సన్ లకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం ను జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి. రెమా రాజేశ్వరి,బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పి.అంజన్ రావు , బృందాదర్ రావు, తదితరులు పాల్గొన్నారు .ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి గా పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగ దీశ్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు లో రాష్ట్రం దేశం లోనే రోల్ మోడల్ గా వుందని,ప్రజల రక్షణ లో పోలీసింగ్ లో కూడా రాష్ట్రం నంబర్ వన్ గా వుందని, బాలల హక్కుల పరిరక్షణ లో కూడా మన రాష్ట్రం రోల్ మోడల్ గా వుండేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ,సంరక్షణ లో తల్లి దండ్రుల తో పాటు సమాజం,ప్రభుత్వం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి పని చేయాలని అన్నారు.భారత దేశం లో కుటుంబ వ్యవస్థ లో పిల్లలు బాధ్యత,పోషణ తల్లి దండ్రులు చూసుకుంటారని,తల్లిదండ్రులు లేని అనాథలు,తల్లి దండ్రులు వుండి పిల్లల బాగోగులు సరిగా చూసుకో లేని పరిస్థితులు వుంటే ఆ పిల్లల సంరక్షణ పట్ల సమాజం,ప్రభుత్వం బాధ్యత వుంటుందని అన్నారు.సమాజం లో పాశ్చాత్య సంస్తృతి ప్రవేశం వలన కుటుంబాలు విడిపోయి పిల్లల మానసికంగా ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. పట్టణాల్లో పిల్లల ను యాచక వృత్తి లో పెట్టీ వసూలు చేయడం,ఆడ పిల్లల అక్రమ రవాణా,ఇటుక బట్టీలలో పిల్లలు పని చేయడం జరుగుతోందని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ లో సర్పంచ్ ఆధ్వర్యం లో గ్రామ కమిటీ లు కీలక పాత్ర పోషించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామం లో మంచి నీటి సౌకర్యం,వైకుంఠ ధామం లు నిర్మాణం,పల్లె ప్రకృతి వనం లు ఏర్పాటు,డంపింగ్ యార్డు లు,చెత్త సేకరణ కు ట్రాక్టర్ లు వసతులు,సౌకర్యాలు కల్పనలో గ్రామాలు అద్భుతంగా అభివృద్ది చెందినట్లు, పట్టణాల తో పోటీ పడుతున్నట్లు,గ్రామాల అభివృద్ధి లో సర్పంచ్ లు కీలక పాత్ర పోషించారని అన్నారు. బాలల హక్కుల ఉల్లంఘనలు జరగకుండా సంబంధిత అధికారుల సమన్వయము తో బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యా హక్కు అమలు లో బాగంగా బడి ఈడు పిల్లలు అందరినీ బడుల్లో చేర్పించడం, ఏ రాష్ట్రంలో లేనన్ని గురుకులాలను తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగిందని,విద్యకు దూరమైన బడుగు,బలహీన వర్గాలు,మైనార్టీ లకు గురు కులాల్లో నాణ్యమైన విద్య ను అందించేందుకు ప్రతి విద్యార్థి పై 1.25 లక్షలు ఖర్చు చేయడం జరుగుతుందని, వసతి గృహాల్లోని పిల్లలకు నాణ్యమైన భోజనం బట్టలు కోసం ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ లకు తల్లి దండ్రులు పోటీ పడుతున్నారని,ప్రభుత్వ పాఠశాలలు పై విశ్వాసం పెరిగిందని,తెలంగాణ వచ్చాక ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలని తల్లి దండ్రులలో వచ్చిన మార్పు కారణమని అన్నారు. పెండ్లీడు ఆడ బిడ్డల పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.గ్రామాల్లో వెనుక బడిన ,సమస్యలు ఉన్న పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని, పిల్లలకు మంచి విద్యనందించినప్పుడే
భావితరాలు బాగుపడతాయని తెలిపారు. అనంతరం కార్యక్రమం చివరగా బాలల పరిరక్షణ కమిటీ నిర్వహించాల్సిన విధులకు సంబంధించిన కరదీపికను మంత్రి ఆవిష్కరించారు.
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అంజన్ రావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలు గురించి కరదీపికను ఆవిష్కరించినట్లు తెలిపారు. పరిరక్షణ కమిటీలు నిర్వహించాల్సిన విధుల గురించి ఈ కార్యక్రమం ద్వారా సర్పంచులకు,ఎం.పి.పి.లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. 33 జిల్లాల్లో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేశామని అన్నారు.బాలలు జీవించే హక్కు,రక్షణ పొందే హక్కు,భాగస్వామ్య హక్కు,అభివృద్ది చెందే హక్కు లు కలిగి ఉంటారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం శిశువు పుట్టిన నుండి 18 సం.ల వరకు మాతా శిశు సంరక్షణకు ఎన్నో పథకాలు అమలు చేస్తోందని,అంగన్వాడీ ల ద్వారా గర్భీనీ లు పిల్లల కు పోషక హరం,ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు అయిన వారికి కె.సి.అర్.కిట్,గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య తదితర పథకాలు అమలు చేస్తున్నప్పటికీ సమాజం లో అనేక సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు.ముఖ్యంగా బాలల హక్కుల పట్ల అవగాహన లేకపోవడమే కారణమని అన్నారు.గ్రామ యూనిట్ గా గ్రామ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ లు ఏర్పాటు చేసినట్లు,వీరికి అవగాహన కలిగించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బ్రుందాధర్ రావు మాట్లాడుతూ గ్రామంలో బాలల పట్ల ఎటువంటి సంఘటనలు జరిగినా సంబంధిత అధికారికి రిపోర్ట్ చేయాలని అన్నారు.గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలన, దత్తత, బాలలపై నేరాలు అరికట్టడమే ధ్యేయంగా బాలల హక్కుల పరిరక్షణ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. విద్య మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించడం కమిటీ బాధ్యత అని అన్నారు.జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ బాలల న్యాయ సంరక్షణ చట్టం ప్రకారం గ్రామ,మండల,జిల్లా స్థాయి లో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ లు ఏర్పాటు చేసి నట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో అర్.డి. ఓ జగన్నాథ రావు, జడ్.పి.సి. ఈ. ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి,జిల్లా విద్యా శాఖ అధికారి బిక్ష పతి,స్త్రీ,శిశు, వయో వృద్ధుల, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు .