కూలిన కళా శిఖరం…

ఆగస్టు21(జనంసాక్షి): కళలకు కాణాచి తెలంగాణ. తెలంగాణ తల్లి ఒడిలో పుట్టి పురిగిన వైతాళికులు ఎందరో. అందులో మన సిద్దిపేటకు చెందిన కాపు రాజయ్య ఒకరు. ఆరు దశాబ్దాల పాటు కళనే నమ్ముకొని కళే జీవితంగా బతికిన మహోన్నతుడు. సిద్దిపేట అంటేనే గుర్తుకొచ్చే అద్బుత కళాకారుడు కాపు రాజయ్య. ఆయన ఇక లేరు అని తెల్పుటకు చింతిస్తున్నాం. 87 సంవత్సరాల వయస్సు దాక నిర్విరామంగా సాగిన కుంచె ఆగిపోయింది. తెలంగాణ ఓ మహోన్నత కళాకారుడ్ని కోల్పోయింది.
తన కుంచెతో ఎన్నో మరపురాని చిత్రాలను గీసిన ఆయన సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సిద్దిపేటలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం మృతిచెందారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తి పతాకను రెపరెపలాడించిన ఆయన శ్రమైక జీవన సౌందర్యం, పల్లె బతుకుల, బతుకమ్మలపై గీసిన చిత్రాలు ఖ్యాతికెక్కాయి. ఆయన చిత్రాలు తెలంగాణ సంస్కీతి సాంప్రదాయలకు అద్దం పట్టాయి. ఆయనకు భార్య ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1925 ఏప్రిల్‌ 6న సిద్దిపేటలో రాఘవులు, భూలక్ష్మి దంపతులకు జన్మించిన కాపు రాజయ్యకు చిన్నతనం నుంచే చిత్ర కళపై ఆసక్తిని పెంచుకొన్నారు. చిన్నపుడే నకాషి చిత్రాల పట్ల ఆకర్షితుడైన ఆయన చేతి వృత్తుల విన్యాసాలకు ముగ్దుడయ్యారు. రాజయ్య ప్రతిభకు ఆయన గురువు అయిన కుబేరుడు ప్రోత్సాహం లభించింది. రాజయ్యను బొంబాయిలోని ఇంటర్మీడియేట్‌ స్థాయి డ్రాయింగ్‌ పరీక్షలకు పంపాడు. తర్వాత 1943లో హైద్రాబాద్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లో చేరిన ఆయన పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగారు. పల్లె సంస్కృతి, వివిధ వృత్తులు ఆయన చిత్రాల్లో ప్రతిబింబిస్తాయి. 1946లో సంగారెడ్డిలో డ్రాయింగ్‌ టీచర్‌గా చేరారు. 1950 నుండి 1970 వరకు వివిధ రంగులతో చిత్రాలు వేసిన ఆయన 1983లో సిద్దిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా పదవీ విరమణ చేశారు. ఎన్నో పత్రికల్లో ఆయన చిత్రాలు ప్రచురితమయ్యాయి. ఓ వీక్లీలో రాజయ్య వేసిన దుర్గ చిత్ర పటాన్ని చూసిన మహరాజు ఇండోర్కర్‌ 500 రూపాయలను వీపిపి ద్వారా పంపించారు. లండన్‌ నుంచి వెలువడే ది స్టూడియో మాగెజెన్‌లో తెలంగాణ సంస్కృతి అయిన బోనాలు చిత్రం ప్రచురితమయ్యింది. ది వీక్‌ పత్రిక ఆయన్ను ప్రశంసిస్తూ ఆయనను ఆంధ్రా జామ్నీరాయ్‌గా అభివర్ణించింది. రాజయ్య కుంచె నుంచి జాలువారిన రిస్కీ లైఫ్‌, బోనాలు, బతుకమ్మ తదితర చిత్రాలు ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిపెట్టాయి.
ప్రముఖుల సంతాపం..
కాపు రాజయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ అధినేత కె చంద్రశేఖర్‌ రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తెలంగాణ కళారంగానికి తీరని లోటని, అలాంటి మహనీయవ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. తెలంగాణ సంస్కృతిని తన చిత్రాల్లో బంధించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. సిద్దిపేటలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజయ్య మృతి పట్ల జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి, పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం విసి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, చిత్రకారులు లక్ష్మణ్‌ ఏలే, కార్టూనిస్ట్‌ శంకర్‌, పలు పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.