2జీ స్పెక్టం కేసులో రూ.1.76 లక్షల కోట్ల నష్టం

మరోమారు వెల్లడించిన జైట్లీ

న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్టం కేటాయింపుల వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. 2007-2008లో 2జీ స్పెక్టం కేటాయింపులు జరిగాయి. అయితే కేటాయింపుల పక్రియను ‘రిగ్గింగ్‌’ చేశారని జైట్లీ అన్నారు. కాంపటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఒకరోజు రోడ్‌షో ఈవెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ కేసు వివాదాన్ని మంత్రి ప్రస్తావించారు. ‘మొదటి వచ్చిన వారికి మొదటి కేటాయింపు పద్ధతిలో కేటాయింపు జరగడం వివాద కారణాంశాల్లో ఒకటి. తమకు నచ్చిన పార్టీకే కేటాయింపులు జరిగేందుకు ఇందులో వీలుంటుంది. అనూకూల పార్టీలను 7, 8 ఫ్లోర్లకు పంపుతారు. ప్రత్యర్థులు రాగానే లిఫ్ట్‌లు పనిచేయడం ఆగిపోతాయి. కార్‌ పార్కింగ్‌ ఏరియాలోనూ ఆటంకాలు ఎదురవుతుంటాయి’ అని జైట్లీ పేర్కొన్నారు. ఈ కేటాయింపుల ద్వారా రూ.1.76 లక్షల కోట్ల మేరకు ఖజానాకు గండిపడిందంటూ కాగ్‌ నివేదిక ఇవ్వడం అప్పట్లో సంచలనమైంది. ఈ కేసులో నిందితులైన మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, తదితరలను పాటియాలా హౌస్‌ కోర్టు ఇటీవల నిర్దోషులుగా విడిచిపెట్టింది. అయితే ఈ తీర్పును సీబీఐ సవాలు చేయడంతో 2019 ఫిబ్రవరి 7న తదుపరి విచారణ తేదీగా ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది.