20న బిహార్ సీఎంగా మూడోసారి నితీశ్ ప్రమాణం!

22పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా మూడోసారి నితీశ్ కుమార్ పగ్గాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బిహార్ అధికారపక్షం జేడీయూ తరపున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం సమావేశమై నితీశ్ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. అనంతరం మహాకూటమిలోని పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లు సమావేశమవుతాయి. ఈ సమావేశంలో మహాకూటమి శాసనసభ పక్ష నాయకుడిగా నితీశ్ను ఎన్నుకుంటారు. ఈ నెల 20న బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణం చేయనున్నట్టు జేడీయూ వర్గాలు తెలిపాయి. నితీశ్తో పాటు 36 మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశముంది.

రేపు నితీశ్ కుమార్ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత శాసన సభను రద్దు చేయాలని నితీశ్ సిఫారసు చేస్తారు. ఇదే రోజు మహాకూటమి సంయుక్త సమావేశం అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నితీశ్ ప్రకటన చేస్తారు. ఇదిలావుండగా ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఈ రోజు సమావేశమై శాసనసభ పక్ష నాయకుడ్ని ఎన్నుకుంటారు. ఈ పదవికి రఘోపూర్ నుంచి ఎన్నికైన ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కొడుకు తేజస్వి యాదవ్ పేరు వినిపిస్తోంది. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందే మహాకూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ పేరును ప్రకటించారు.