200 మంది భారతీయ విద్యార్థులపై హరికేన్‌ ప్రభావం-సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ,ఆగస్టు28 : హరికేన్‌ హార్వే ప్రభావం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న హూస్టన్‌ వర్సిటీలో సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. గత మూడు రోజులుగా హూస్టన్‌లో హరికేన్‌ హార్వే వల్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఆకస్మికంగా పోటెత్తుతున్న వరదల వల్ల కూడా హూస్టన్‌ యూనివర్సిటీ పూర్తిగా జలమయం అయ్యింది. అయితే నీటిలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. హూస్టన్‌లో ఉన్న ఇండియన్‌ కౌన్సల్‌ జనరల్‌ అనుపమ్‌ రాయ్‌తో టచ్‌లో ఉన్నట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు ఉన్న

వర్సిటీ ప్రాంతంలో నీళ్లు పీకల్లోతు వరకు ఉన్నాయని, ఆ విద్యార్థులకు ఆహారాన్ని చేరవేసేందుకు భారత్‌ చేసిన ప్రయత్నాలను అమెరికా కోస్టు గార్డులు తిరస్కరించారని, రెస్క్యూ బోట్లు లేని కారణంగా సహాయాన్ని నిరాకరించినట్లు సుష్మా ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.