2014 ఎన్నికల్లో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు మద్దతు
న్యూడిల్లీ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాయేతర ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏదైన ఏర్పడితే మద్దతిస్తామని అన్నా బృందం తెలిపింది. 2014లో విప్లవం రానుందని.. అది పార్టీ లేదా ముఖాలు మారడం కాదని, వ్యవస్థనే మార్చుతుందని అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ శనివారమిక్కడ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. అవినీతిపై అన్నా బృందం ఉద్యమం వల్ల దేశంలో రాజకీయ వ్యవస్‌థ మీద కొన్ని ప్రాథమిక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయన్నారు. రాజకీయాలు మారనంత వరకు అవినీతి, ధరలు, పేదరికం సమస్యలు తీరవని ప్రజలకు అర్థమైందని చెప్పారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో ఎవరో ఒక మంచి నాయకుడు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తారని తెలిపారు. అలాంటి ప్రత్యామ్నాయానికి తాము మద్దతిస్తామన్నారు. వారి తరుపున హజారే ప్రచారం కూడా చేస్తారని చెప్పారు. కాంగ్రెస్‌పై ప్రజాగ్రహంతో భాజపా లబ్ధి పొందుతుందేమోనని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. భాజపా అధికారంలోకి వచ్చిన లోక్‌పాల్ తీసుకురాదని, అందుకే తాము ప్రత్యామ్నాయం కోరుకుంటున్నామని చెప్పారు. బాబా రాందేవ్ రాజకీయాల్లో ప్రవేశించడం తప్పేమీ కాదన్నారు. ప్రధానితో పాటు 15మంది మంత్రులపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25నుంచి అన్నా బృందం చేపట్టనున్న నిరాహార దీక్షలో ఆరోగ్య కారణాల దృష్ట్యా హజారే పాల్గొనడం లేదని తెలిపారు.