2020 తరువాత నితీశ్‌..  సీఎంగా తప్పుకుంటారు


– సీఎం పీఠాన్ని అధిష్టించే ఉద్దేశం లేదని స్వయంగా నితీశే చెప్పారు
– కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా వ్యాఖ్య
– కుష్వాహా వ్యాఖ్యలను కొట్టిపారేసిన జేడీయూ నేత నీరజ్‌కుమార్‌
న్యూఢిల్లీ, నవంబర్‌1(జ‌నంసాక్షి) : 2020 తరువాత బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టరని, ఆయనకు సీఎం పదవిని చేపట్టేందుకు ఆసక్తి లేదని ఈ విషయాన్ని నితీశే తనతో స్వయంగా చెప్పారని కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి, రాష్టీయ్ర లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా సంచలన వ్యాఖ్యలు చేశారు.  గురువారం ఆయన మాట్లాడుతూ.. 2020 తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగే ఉద్దేశం నితీశ్‌కు లేదని స్వయంగా ఆయనే తనకు వ్యక్తిగతంగా చెప్పినట్లు తెలిపారు. తాను నితీశ్‌పై ఎలాంటి రాజకీయ సెటైర్లు వేయడం లేదన్నారు. 2020 ఎన్నికల నుంచి తనకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే ఉద్దేశం లేదని స్వయంగా ఆయనే కొద్ది నెలల క్రితం నాతో అన్నారన్నారు. 15ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని పాలించానని, ఇంకా ఎంతకాలం కొనసాగాలని అన్నారని తెలిపారు. పట్నాలో నిర్వహించిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జన్మదిన వేడుకలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నారు. కుష్వాహా ఉన్నట్టుండి ముఖ్యమంత్రిపై ఈవ్యాఖ్యలు చేయడం ప్రాధ్యాన్యం సంతరించుకుంది. అయితే నితీశ్‌ కుమార్‌ బిహార్‌లో వచ్చేఅసెంబ్లీ ఎన్నికల నుంచి పోటీ చేయబోరనే విషయంపై జేడీయూ నేతలెవరూ ఇంతవరకూ ఎక్కడా మాట్లాడలేదు. మరోవైపు కుష్వాహా వ్యాఖ్యలను జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్‌కుమార్‌ కొట్టిపారేశారు. నితీశ్‌ నాయత్వాన్ని ప్రజలు, ప్రజాప్రతిధులు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. నితీశ్‌ కుమార్‌ గురించి కుష్వాహా ఈ తరహాలో వ్యాఖ్యానించడం ఇది మొదటిసారి కాదు. 2020 ఎన్నికల్లో ఎన్డీయే-జేడీయూ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్‌ను ఎలా నిలబెడతారని జులైలో ఆయన ఓ సందర్భంలో ప్రశ్నించారు. గతంలో జేడీయూలో ఉన్న కుష్వాహా 2013లో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం ఆయన ఆర్‌ఎల్‌ఎస్‌పీని స్థాపించి ఎన్డీయేతో చేతులు కలిపారు.