2023 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా అరికడతాం
– వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్, అక్టోబర్23(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో 2023 సంవత్సరం నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా అరికడతామని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపట్టిందని, ప్రతి ఒక్కరు సహకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. రివైజ్ నేషనల్ టీబీ కంట్రోల్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఎర్రగడ్డలోని రాష్ట్ర టీబీ కేంద్రంగా రోజువారి ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమాన్ని లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీబీ వైద్య చికిత్స కోసం రెండురోజులకోసారి మందులు ఇచ్చేవారని, ఇక నుంచి రోజువారిగా మందులను పంపిణీ చేయటం జరుగుతుందని లక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలోనే చెస్ట్ ఆసుపత్రిలో రెండు మెడిషనల్ యూనిట్లు, రెండు సర్జనీ యూనిట్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు జరనల్ మెడిసిన్ ట్రీట్‌మెంట్ కూడా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పేదల వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునాతన వైద్య పరికరాలతో పేదలకు ప్రత్యేక వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయటం జరుగుతుందని మంత్రి తెలిపారు. పీహెచ్‌సీ నఉంచి ప్రధాన ఆసుపత్రి వరకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ల ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని సౌకర్యాలతో పేదలకు ప్రభుత్వాస్పత్రుల ద్వారా నాణ్యమైన అందిస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, తదితరులు పాల్గొన్నారు.