22 ఏళ్ల తరువాత రెండో భారత క్రీడాకారిణిగా..
కాలిఫోర్నియా: వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిష్‌లో భారత్‌కు చెందిన మీరాబాయ్ చాను స్వర్ణ పతకం సాధించారు. 48 కేజీల విభాగంలో పాల్గొన్న చాను మొత్తం 194 కేజీలు ఎత్తి పసిడి పతకాన్ని దక్కించుకున్నారు. స్నాచ్ లో 85 కేజీల ఎత్తిన మీరాబాయ్.. క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు ఎత్తి సరికొత్త రికార్డుతో పసిడిని కైవసం చేసుకున్నారు. ఫలితంగా 22 ఏళ్ల తరువాత ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన రెండో భారత క్రీడాకారిణిగా చాను గుర్తింపు సాధించింది.
1995లో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షి కరణం మల్లీశ్వరి తొలిసారి స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ తరువత ఇంత కాలానికి చాను మళ్లీ పసిడిని ఒడిసిపట్టుకుని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఈ సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన సీనియర్‌వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన చాను వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించారు.
చానూ.. దేశానికి గర్వకారణం: రాష్ట్రపతి
ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణపతకం సాధించిన మీరాబాయి చానును చూసి దేశం గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. దేశానికి పసిడి పతకాన్ని తెచ్చిపెట్టిన ఆమె క్రీడాస్ఫూర్తిని కొనియాడారు. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణం సాధించిన ఆమెకు అభినందనలు తెలిపారు. అద్భుతమైన మహిళా క్రీడాకారిణిని ఈ దేశానికి అందించిన మణిపూర్ రాష్ట్రాన్ని రాష్ట్రపతి అభినందించారు. రైల్వే అధికారిణి అయిన 23 ఏళ్ల చాను 48 కిలోల విభాగంలో మొత్తం 194 కిలోలు ( స్నాచ్‌లో 85 కిలోలు , క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కిలోలు) ఎత్తి సరికొత్త రికార్డు నెలకొల్పారు.
కాలిఫోర్నియాలోని అనాహిమ్‌లో జరుగుతోన్న ఈ ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొన్న చాను తన ప్రతిభతో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఒలింపిక్స్‌లో రజత పతకం విజేత కరణం మల్లీశ్వరి తర్వాత ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన రెండో భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. 1994, 1995లో కరణం మల్లీశ్వరి స్వర్ణం దక్కించుకున్న సంగతి తెలిసిందే.