230 పాయింట్ల నష్టంలో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: ఇన్ఫోసిస్‌ స్టాక్‌ మార్కెట్లకు మరోసారి షాక్‌ ఇచ్చింది. ఆర్థిక ఫలితాల విషయంలో మార్కెట్‌ అంచనాలకు సుదూరంలో ఉండిపోయింది. ఫలితంగా కంపెనీ షేరు ధర ఒకే రోజు 16 శాతానికి నష్టపోయింది. 500 రూపాయల దాకా పడుతూ 2,420కి సమీపంలో ట్రెడవుతోంది.  దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన  ఇన్ఫోసిస్‌ ఇంత  తీవ్ర స్థాయిలో నష్టపోవడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.

డిసెంబరు క్వార్టర్‌లో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ భారీ లాభాలు ప్రకటించిన కంపెనీ.. మార్చి క్వార్టర్‌ వచ్చేసరికి మళ్లీ మొదటికి వచ్చింది. ఒక్క డిసెంబరు త్రైమాసికాన్ని తప్పిస్తే.. రెండేళ్లకు పైగా ఇన్వెస్టర్లను నిరాశపరుస్తూనే ఉంది. ఓ పక్క టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ గొప్ప పనితీరు కనబరుస్తుంటే.. ఇన్ఫీ మాత్రం ..తిరోగమనంలో పయనిస్తోంది.

బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ  షేరు భారీగా నష్టపోవడంతో స్టాక్‌ మార్కెట్లు కూడా బాగా పడుతున్నాయి. సెన్సెక్స్‌ 240 పాయింట్లు కోల్పోతూ 18,300 లకు ట్రేడవుతోంది. నిఫ్టీ 55 పాయింట్లకు పైగా కోల్పోతూ 5,535  సమీపంలో ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్‌ దెబ్బకు ఇతర ఐటీ షేర్లు కూడా  పడుతున్నాయి. విప్రో 4.5 శాతం టీసీఎస్‌ 3శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌  2శాతం కోల్పోతున్నాయి.