రేపే భారత్-శ్రీలంక ఆసియా కప్ టైటిల్ పోరు.. మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దయితే విజేత ఎవరు..?
ఆసియా కప్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మీద విజయం సాధించిన భారత్, శ్రీలంక ఆసియా కప్ టైటిల్ పోరులో రేపు తలపడనున్నాయి. కొలంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ఆర్ ప్రేమదాస స్టేడియా ఆతిథ్యమివ్వనుంది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. ఎలా అయినా ఈ సారి కూడా టైటిల్ గెలిచి భారత్ రికార్డును సమం చేయాలనే యోచనలో ఉంది. అయితే 1984 నుంచి జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో 7 సార్లు విజేతగా నిలిచిన భారత్ మాత్రం తన లెక్కను మరింతగా పెంచుకోవాలని భావిస్తోంది. పైగా ఆసియా కప్ టోర్నీ ఫైనల్‌లో ఇప్పటికే ఇరు జట్లు 7 సార్లు పోటీపడగా.. భారత్ 4 సార్లు, లంక 3 సార్లు గెలిచింది. ఈ క్రమంలో భారత్‌పై గెలిచి ఆ లెక్కను కూడా సమం చేయాలని లంకేయుల ఆలోచన. అయితే భారత్, శ్రీలంక మధ్య టైటిల్ కోసం హోరాహోరీగా జరగబోతున్న ఈ మ్యాచ్‌కి నేనూ పోటీ అంటూ వరుణుడు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆగకుండా వర్షం పడి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి..? భారత్, శ్రీలంక జట్టుల్లో ఎవరు విజేతగా నిలుస్తారు..?