24న అనంతకు రాహుల్
న్యూఢిల్లీ,జులై15(జనంసాక్షి):
ఈ నెల 24న అనంతపురం జిల్లాలో రాహుల్ పాదయాత్ర జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. రాహుల్ ను అడ్డుకుంటే జరగబోయే పరిణామాలకు టీడీపీయే బాధ్యతవహించాల్సి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ రైతులు, చేనేత కార్మికులు, మహిళలతో సమావేశం అవుతారని చెప్పారు. బుధవారం డిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. రాహుల్ యాత్రను అడ్డుకుంటామన్న టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు చంద్రబాబే కారణమని రఘువీరా ఆరోపించారు. 12 ఏళ్ల క్రితం పుష్కరాలకు రూ.28 కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు ఏకంగా రూ.1600 కోట్లు ఖర్చు చేశారని దీంట్లో ఎంత అవినీతి జరిగిందో చంద్రబాబు చెప్పాలన్నారు. చంద్రబాబుపై పుష్కరాల నిర్వహణకు సంబంధించి తాము కేసులు పెడతామని చెప్పారు. చంద్రబాబుపై కేసును కోర్టులు సుమోటోగా తీసుకోవాలని కోరారు. క్రెడిట్ వస్తే తనకు, వైఫ్యలాలు ఎదురైతే అధికారులకు ఆపాదించడం చంద్రబాబు నైజమని రఘువీరా విమర్శించారు. చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేసారు. అంతకు ముందు ఎపి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌తో బేటీ అయ్యారు. ఇక్కడ పార్టీ పటిష్టతపైన చర్చించారు. ఇరురాష్ట్రాల్లో పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలన్నారు. దిగ్విజయ్‌ను కలిసిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, రామచంద్రయ్య తదితరులు ఉన్నారు.