24వారాల గర్భస్రావానికి సుప్రీం అనుమతి 

దిల్లీ: అసాధారణ పరిస్థితుల్లో ఉన్న తన 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు మహారాష్ట్రలోని పుణెకు చెందిన మహిళకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. పుట్టబోయే బిడ్డకు పుర్రె లేదని.. ఇలాంటి వాటికి చికిత్స కూడా లేదని పుణెలోని బీజే ప్రభుత్వ మెడికల్‌ కళాశాల న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. దీన్ని పరిశీలించిన కోర్టు.. అబార్షన్‌కు అనుమతినిచ్చింది.పుణెకు చెందిన ఓ మహిళ ఇటీవల గర్భం దాల్చింది. అయితే ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా.. గర్భస్థ పిండానికి పుర్రె, మెదడు లేదని తేలింది. బిడ్డ పుట్టినా కూడా బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెప్పడంతో ఆమె అబార్షన్‌ చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే అప్పటికే ఆమె గర్భానికి 20 వారాలు దాటాయి. అంటే భారత చట్టాల ప్రకారం అబార్షన్‌ను అనుమతి లేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మహిళ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆమె చికిత్స పొందుతున్న బీజే ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆసుపత్రిని నివేదిక అడిగింది. దీంతో వారు న్యాయస్థానానికి వివరాలు వెల్లడించారు. ఈ నివేదికను పరిశీలించిన కోర్టు గర్భస్రావానికి అనుమతినిచ్చింది. ‘ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో అబార్షన్‌ తప్పనిసరి అని న్యాయస్థానం భావిస్తోంది’ అని కోర్టు పేర్కొంది.