24 కరెంటును వ్యతిరేకిస్తారా?
కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేయండి : కేసీఆర్ పిలుపు
ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న ఆ పార్టీకే పాతరేయాలి
మంథనిలో పుట్ట మధును గెలిపిస్తే 1000 కోట్లు మంజూరు చేస్తా
బీసీలకు అవకాశం వచ్చేది తక్కువ.. ఐక్యతను చాటి చెప్పాలి
సింగరేణిలో 49శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్సే..
ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
మంథని/మంచిర్యాల ప్రతినిధి (జనంసాక్షి): 24 గంటల కరెంటు ఇచ్చే తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ వచ్చి తమ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారని, ఆయన వ్యాఖ్యలపై దేనితో నవ్వాలోనని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని స్కీములను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ధరణిని రద్దు చేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందని, ధరణిని రద్దు చేసి బంగాళాఖాతంలో కలుపుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు.
మంగళవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర లో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావద్దని పార్టీల చరిత్ర ఏందో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాబోయేది ముమ్మాటికీ బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని, ఎమ్మెల్యే మనోడు, స్థానికుడు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, మంథనిలోనే ఉండే బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధును ఎమ్మెల్యే గెలిపిస్తే మంథనిలోనే ఒకరోజు కూర్చొని 1000 కోట్లు మంజూరు చేసి వెనుకబడిన మంథని నియోజకవర్గ దరిద్రాన్ని అంతా పోగొడతా..అని హావిూ ఇచ్చారు. పుట్ట మధు కోరినవి గొంతమ్మ కోరికలు కావని వాటన్నిటిని తీర్చడంతో పాటు పుట్ట మధు కోరినట్లు గుంజపడుగు, గొర్లగూడెంలను మండలాలుగా ప్రకటిస్తామని తెలిపారు. బీసీలకు అవకాశం వచ్చేది తక్కువ అని, ప్రజా సేవే లక్ష్యంగా ఎదుగుతున్న బిసి బిడ్డ పుట్ట మధును భారీ మెజార్టీతో గెలిపించి బీసీల ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. పీవీ నరసింహారావు హయాంలో చేపట్టిన రింగ్ రోడ్డు పుట్ట మధు ఎమ్మెల్యే అయ్యాకనే పూర్తి అయ్యిందని, తన వద్ద పట్టు పట్టి నిధులు మంజూరు చేయించుకుని మారుమూల పంకన, పలిమెల ప్రాంతాల్లో బ్రిడ్జిలు రోడ్లు వంతనలు నిర్మించి మార్మూల పల్లెల్లో వెలుగులు తీసుకువచ్చిన ఘనత పుట్ట మధుకే దక్కుతుందని అన్నారు. ధరణి రాకముందు ఎల్లయ్య భూమి మల్లయ్య పేరు విూద, మల్లయ్య భూమి ఎల్లయ్య పేరు విూద రాసి కచేర్లపండి తిప్పి వేలకు వేలు రైతుల వద్ద లంచాలు వసూలు చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దన్నారు. విూ బొటన వేలు పెడితేనే విూ భూమి రికార్డు మారే విధంగా పకడ్బందీగా మూడు సంవత్సరాలు కష్టపడి ధరణి తీసుకురావడం జరిగిందన్నారు. 1956 ముందున్న తెలంగాణను జబర్దస్త్ ఆంధ్రాలో కలిపి 58 ఏళ్లు తెలంగాణ ప్రజలను బోసపెట్టుకుంది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ఉన్న తరుణంలో టిఆర్‌ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ 2024లో పొత్తు పెట్టుకుని ఇటు ఏపీలో అటు కేంద్రంలో రెండు చోట్ల అధికారంలోకి వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఇవ్వకుండా, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఉద్యమాన్ని అణచివేస్తూ 15 సంవత్సరాలు మోసం చేసిందని మండిపడ్డారు. తాను చావు నోట్లో తలపెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేపడితే తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించి మళ్లీ వెనక్కి వెళ్లిందని.. ఆ తరువాత దేశంలో 33 పార్టీల మద్దతుతో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ గత్యంతరం లేక ఇచ్చిందే తప్ప ఇష్టపూర్వకంగా ఇవ్వలేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల చరిత్ర వారి వైఖరి నడవడిక ఏందో తెలుసుకుని ప్రజలు ఓట్లు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. టిఆర్‌ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమని అన్నారు.
ఢల్లీి బానిసలను నమ్మి ఆగం కాకుండ్రి..
కోటు వేసుకొని కోట్లు పట్టుకొని తిరుగుతున్న లీడర్లను నమ్మి ఆగం కావద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మంగళవారం మందమర్రిలో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ముందుగా మాజీ మంత్రి బోడ జెనార్ధన్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు నగేష్, బిజెపి నాయకులు పత్తి శ్రీనివాస్ లకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని, ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అన్నారు. డబ్బుకు ఓటు అమ్ముకోవద్దని, మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టేఅని, తెలంగాణ రాకముందు వరకు భయంకర పరిస్థితులు ఉండేవన్నారు. సింగరేణిలో 49శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్సేనని, వారి పాలనలో నష్టాల్లోకి వెళ్లిన సింగరేణి.. ప్రస్తుతం రూ.2184కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చాం అన్నారు. రైతుబంధు వద్దు, ధరణి పోర్టల్ వద్దు, కరెంటు వద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారన్నారు. వీటన్నింటినీ తీసేసి మళ్లీ దళారుల, పైరవీకారుల రాజ్యాన్ని తీసుకురావాలని చూస్తున్న కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రావొద్దన్నారు. ఇక, నరేంద్ర మోడీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టిందని, సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో కోటు వేసుకున్న లీడర్లు కోట్ల రూపాయలు పట్టుకొని ప్రజల్ని ఆగం చేస్తున్నారని, నాలుగేళ్లకు ఒకసారి అచ్చే లీడర్లను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. చెన్నూర్ అభ్యర్థి సుమన్ మాట్లాడుతూ తనకు మరోసారి ఈ ఎన్నికల్లో ఆశీర్వాదం కావాలని అన్నారు. కారోనా సమయంలో రెండు సంవత్సరాలు కేంద్రం నుండి నిధులు రాకపోయినా కేసీఆర్ చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి కోసం నిధులు కేటాయించారని, నియోజకవర్గంలోని చెన్నూర్, మందమర్రి, క్యాథనపల్లి మున్సిపాలిటీలలో అభివృద్ధి కోసం 700 కోట్లకు పైగా నిధులను కేటాయించారని అన్నారు. చెన్నూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో కెసిఆర్ మాట్లాడుతూ బాల్క సుమన్ రాక ముందు, వచ్చిన తర్వాత చెన్నూరు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. చెన్నూరులో సుమన్ చాలా అభివృద్ధి పనులు చేశాడని, ఎక్కువ సమయం సుమన్ నా దగ్గరే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తుంటాడన్నారు. సిఎం దగ్గర ఉండే సుమన్ ను గెలిపించుకుంటే వేగంగా పనులు జరుగుతాయి కాబట్టి సుమన్ ను 50వేల మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ప్రజా ఆశీర్వాద సభలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంటా వెంకటేష్ నేత, మంచిర్యాల బిఆర్‌ఎస్ అభ్యర్థి నడిపెళ్లి దివాకర్ రావు, బెల్లంపల్లి బిఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందర్ రెడ్డి బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.