25న ఆదిలాబాద్‌లో మినీ మహానాడు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లో ఈనెల 25న తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును నిర్వహించనుంది. దీనికి బాబు తనయుడు నారా లోకేష్‌, పార్టీ జిల్లా ఇన్‌చార్జీ మండవ వెంకటేశ్వర్‌రావు, జిల్లాలోని పార్టీనేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాయల్‌ శంకర్‌ ఆదిలాబాద్‌ బుధవారం విలేకరులకు చెప్పారు. జిల్లాలోని పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. మినీ మహానాడులో చర్చించే ఆంశాలను వివరించారు. జిల్లాలో రైతుల కష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకునే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని చెప్పారు. తెదేపా అధికారంలోకి వస్తే రుణమాఫీ పథకం అమలు చేస్తుందని అదెలా సాధ్యమో కూడా వివరిస్తామని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీ పటిష్టంపై గురించి వివరిస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామపరిపాలన అస్తవ్యస్తం ప్రజల ఇబ్బందులపై చర్చించి వాటి పరిష్కారానికి పార్టీ పరంగా చేయాల్సిన కార్యచరణను రూపొదిస్తామని వివరించారు. సమావేశంలో తెదేపా జిల్లా అధికారప్రతినిధి సంతోష్‌, జిల్లా తెలుగు యువప్రధాన కార్యదర్శి బాలాపూర్‌ విఠల్‌, ఆదిలాబాద్‌, జైనాథ్‌ పట్టణ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మునిగెల నర్సింగ్‌, ఓససురేష్‌, వెంకట్‌రెడ్డి, సుధాం తదితరులు పాల్గొన్నారు.