-->

26న సార్వత్రిక సమ్మెకు సిద్దం అవుతున్న కార్మికులు

వసల కార్మికుల సమస్యలపైనా చర్చించాలని పట్టు

హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): కార్మికులను బానిసత్వంలోకి నెట్టే కార్మిక చట్టాల కోడ్‌లను రద్దు చేయాలని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యంచేసే చట్టాలను రద్దుచేయాలని కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సర్వత్రా మద్దతు వస్తోంది. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను ఈ సమ్మెద్వారా తిప్పికొట్టాలని కోరుతున్నారు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు అశేష ప్రజానీకం అనేక సమస్యలతో కరోనాతో తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచారన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు సహాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7,500లు ఇవ్వాలని, 10కిలోల సన్నబియ్యం ఇవ్వాలని సంఘటితరంగ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని ప్రభుత్వ ఉద్యోగులపై వీరి వేధింపులు మానుకోవాలని కోరారు. జీరో ఎకౌంట్‌లో ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు ఇస్తానని చెప్పిన ప్రధాని ఇచ్చిన మాటను గాలికొదిలారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 26తేదీన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రాజకీయాలకతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ కారణంగా పనులు పోగొట్టుకుని తమ స్వస్థలాకు తిరిగి వెళుతున్న లక్షలాది మంది వలస కార్మికులు అవస్థలు ఎదుర్కొన్నారు. వలస కార్మికులకంటూ ఒక చట్టం ఉందనీ, అది 1979లో వచ్చిందని, దాని ప్రకారం వారికి ముఖ్యమైన హక్కులు ఉన్నాయనీ…వాటి సాధన కోసం కార్మిక సంఘాలు కదలలేదు. ఇంతకు ముందు వలస కార్మికులకు ఉన్న చట్టం ప్రకారం వలస కార్మికుల కుటుంబానికి నివాస సౌకర్యం కల్పించాలి. తనకు, తనతో ఉన్న కుటుంబం మొత్తానికి ఆసుపత్రి ఖర్చులు, మందుల ఖర్చులు భరించాలి. కోడ్‌లో వలస కార్మికులకు ఉన్న ముఖ్యమైన హక్కులన్నిటినీ మోడీ ప్రభుత్వం ఎత్తేసింది. ఇతర కార్మికులకు ఇస్తున్న ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ లేదా ఇతర చట్టాల కింద ఉన్న బెనిఫిట్లను మాత్రమే వలస కార్మికులకు ఇవ్వాలని ఉంది. రానూ పోనూ ఖర్చులు భరించాలని ఉంది. కానీ సమాన పనికి సమాన వేతనం, నివాస సౌకర్యం, ఆసుపత్రి సౌకర్యాలను ఎత్తివేశారు. వలస కార్మికుల దుస్థితి చూసి వారిని సంఘటితపర్చాలని కార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్న సమయంలోనే వలస కార్మికుల హక్కులు గాలికి ఎగిరిపోయాయి. కోడ్‌లో ఉన్న మిగిలిన కొద్దిపాటి హక్కులు కూడా అమలు కాని విధంగా కోడ్‌ అమలుకు అవసరమైన వలస కార్మికుల కనీస సంఖ్యను మోడీ ప్రభుత్వం 5 నుండి పదికి పెంచింది. కాంట్రాక్టు కార్మికులు, వలస కార్మికులను సంఘటితం చేయకుండా కార్మికోద్యమం ముందుకు పోలేదు. కార్మికులను ఐక్యం చేయలేదు. కాంట్రాక్టు కార్మికులు, వలస కార్మికులకు కడగండ్లు పెంచిన కోడ్లపై నవంబర్‌ 26 సమ్మె సందర్భంగా వారిలో తీవ్రంగా ప్రచారం చేయాలని,. వారందరినీ సమ్మెకు సవిూకరించాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు.