27న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు
నేడు మరో విడత అధికారులకు శిక్షణ
కరీంనగర్,మే20(జనంసాక్షి): జిల్లాలో ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్‌రూముల్లో భద్రపర్చారు. వీటిదగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. 27న ఓట్ల లెక్కింపు జరుగనుంది. 23న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ముగిస్తే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులకు శిక్షణ కార్యక్రమం పూర్తయింది.
నెల 27న జిల్లాలోని మూడు చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ముందుగా ఎంపీటీసీ స్థానాల లెక్కింపు జరిగిన తర్వాత జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ప్రతి బాక్స్‌లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను వేరుచేసి 25 చొప్పున కట్టలు కడతారు. జడ్పీటీసీ బ్యాలెట్లను ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరిగే వరకు సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఉంచుతారు. 5 మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం 1436 మంది బాధ్యతలను నిర్వర్తిస్తారు. మొత్తం 176 ఎంపీటీసీ స్థానాలు, 15 జడ్పీటీసీ స్థానాల కోసం లెక్కింపునకు శనివారం అధికారులకు శిక్షణ పూర్తయింది. ఈ నెల 21న సిబ్బందికి తిరిగి శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు చేపడుతున్నారు. అభ్యర్థులతో పాటు ఎన్నికల ఏజెంట్లు అనుసరించాల్సిన విధానంపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. చొప్పదండి, తిమ్మాపూర్, మానకొండూర్ మండలాల పరిధిలోని విద్యా సంస్థల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో ఎనిమిది మండలాలకు సంబంధించిన 87 ఎంపీటీసీ స్థానాలు, 8 జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 501 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 198 టేబుళ్లల్లో 711 మంది పోలింగ్ సిబ్బంది, అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ కళాశాలలో చిగురుమామిడి, గన్నేరువరం, హుజూరాబాద్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, శంకరపట్నం, సైదాపూర్, తిమ్మాపూర్ మండలాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. మానకొండూర్ మండలం దేవంపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక మండలాలకు చెందిన నాలుగు జడ్పీటీసీ స్థానాలు, 52 ఎంపీటీసీ స్థానాలకు 276 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం 114 టేబుళ్ల ద్వారా 411 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది ఓట్లను లెక్కిస్తారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ మాడల్ స్కూల్‌లో చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాలకు సంబంధించి 3 జడ్పీటీసీ, 39 ఎంపీటీసీ స్థానాలకుగాను 213 పోలింగ్ స్టేషన్‌లోని 87 టేబుళ్ల ద్వారా 314 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు చేస్తారు.