27 నుంచి ఇంటర్ పరీక్షలు
పక్కాగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
హైదరాబాద్,ఫిబ్రవరి20(జనంసాక్షి): ఈ నెల 27 నుంచి మార్చి 13వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు భయం వీడి పరీక్షలకు సిద్ధం కావాలి.. ఆందోళన చెందకుండా నిర్భయంగా పరీక్ష రాయాలని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు అన్నారు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. జిల్లాల్లో పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పరీక్ష సమయం కంటే ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమన్నారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులుంటే తమను సంప్రదించాలన్నారు. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను హాల్‌టికెట్ల కోసం ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కావాలన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఏ ఒక్కరు కూడా నేలపై కూర్చొని పరీక్ష రాయకుండా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యశాఖ ద్వారా ఏఎన్ఎంలు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచుతారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని అన్నారు. కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు ఒక ప్లయింగ్ స్కాడ్ బృందం, రెండు సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రానికి జియోట్యాగింగ్ అనుసంధానం చేస్తారు. పరీక్ష కేంద్రంలోకి అధికారులు, ఇన్విజిలేటర్లకు, విద్యార్థులకు సెల్ఫోన్లను, ఎలక్టాన్రిక్ వస్తువులను అనుమతించరు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. సీసీ కెమెరాల ముందు ప్రశ్న పత్రాలు తెరుస్తారు. విద్యార్థులు పరీక్షలంటే భయం వీడి.. ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి. కష్టపడి చదివి ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. కాపీయింగ్‌పై ఆధారపడవద్దు. ఉన్న సమయం
సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని సూచించారు.