డోపింగ్‌ భారతం డోప్‌ టెస్టుల్లో పట్టుబడిన 279 భారత అథ్లెట్లు

 

న్యూఢిల్లీ ,ఆగష్ట్‌ 12 (జనంసాక్షి):
భారత క్రీడారంగానికి తీరని మచ్చ… ఇప్పటికే పలువురు అగ్రశ్రేణి అథ్లెట్లు డోప్‌ టెస్టుల్లో దొరికిపోయి నిషేధాన్ని అనుభవిస్తుంటే తాజాగా భారీస్థాయిలో భారత క్రీడాకారులు డోప్‌ టెస్టులు ఫెయిలయ్యారు. నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ గత రెండేళ్ళలో డోపింగ్‌కు పాల్పడిన జాబితాను విడుదల చేసింది. అందరూ ఆశ్చర్యపోయే విధంగా దాదాపు 279 మంది అథ్లెట్లు డోప్‌ టెస్టుల్లో దొరికిపోయారు. వీరిలో పవర్‌ లిఫ్టర్స్‌, వెయిట్‌లిఫ్టర్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు జవాబుగా దీని గురించి కేంద్ర క్రీడాశాఖ మంత్రి జితేందర్‌సింగ్‌ స్పందించారు. ఇటీవలే నాడా ద్వారా 279 మంది డోప్‌ టెస్టుల్లో పట్టుబడినట్టు తెలిసిందని, భారత క్రీడారంగాన్ని డోపింగ్‌ రహితంగా చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు వివరించారు. కాగా గత మూడేళ్ళలో 9898 డోప్‌ టెస్టులు నిర్వహించినట్టు నాడా కేంద్రక్రీడాశాఖకు తెలిపింది. 2011 నుండి డోపింగ్‌పై పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని వెల్లడించింది.