28న భారత బంద్‌..!!

నోట్ల రద్దుపై విపక్షాలు పోరును ఉధృతం చేశాయి. ఈ నెల 28న భారత బంద్‌కు పిలుపునిచ్చాయి. పార్లమెంటు సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం 13 విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌, ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ, డీఎంకే, వామపక్షాలు, తదితర పార్టీలకు చెందిన 200 మందికిపైగా ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఏటీఎంల వద్ద క్యూలో నిల్చున్నట్లు పార్లమెంటు ప్రవేశద్వారం నుంచి ఎంపీలు వరుసగా నిbharat_bandh_2016ల్చుని నిరసన తెలిపారు. ప్రధాని పార్లమెంటుకు వచ్చి రద్దుపై దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దును ప్రపంచంలోనే అతిపెద్ద ప్రణాళికారహిత ఆర్థిక ప్రయోగంగా అభివర్ణించారు. ఆర్థికరంగ నిపుణులను సంప్రదించకుండా.. ఆర్థిక మంత్రికి తెలియకుండా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని రాహుల్‌ ధ్వజమెత్తారు.పార్లమెంటు అంటే ప్రధాని ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. రద్దు నిర్ణయంతో సాఫీగా సాగుతున్న దేశ ఆర్థికవ్యవస్థ భారీ కుదుపునకు గురైందని విమర్శించారు.జంతర్‌మంతర్‌ వద్ద మమత నిర్వహించిన ధర్నాలో పలువురు యువకులు మోదీ అనుకూల నినాదాలు చేశారు. వారిపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ధర్నాను భగ్నం చేసేందుకు బీజేపీ నేతలు వారిని పంపించారని విమర్శించారు.