3న హైకోర్టు ముందుకు విశాఖ కలెక్టర్
విశాఖపట్టణం,డిసెంబర్31 (జనంసాక్షి) : విశాఖపట్నం జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు విశాఖ జిల్లా కలెక్టర్ జనవరి 3వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. సబ్బవరంలోని 255, 272, 277 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిలో కె.దుర్గాప్రసాద్
అనే వ్యక్తి అధికారులతో కుమ్మక్కై నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఎస్.చినవెంకటేశ్వర్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. విచారణ జరిపిన సీజే ధర్మాసనం ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ గత ఏడాది ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని పిటిషనర్ న్యాయవాది ఎన్.హెచ్.అక్బర్ తెలిపారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం కలెక్టర్‌పై మండిపడిరది.