3 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం.. 5 గంటలకు తొలి ఫలితం

5

– జనార్ధన్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి అరగంట పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ నిర్వహిస్తామని, సాయంత్రం 5గంటల తర్వాతే ఫలితాలు వెల్లడిస్తామన్నారు. తొలుత 26 వార్డులకు సంబంధించిన ఫలితం వెలువడే అవకాశం ఉందన్నారు. 6గంటలకల్లా మరో 26 వార్డుల ఫలితం వస్తుందని, రాత్రి 8గంటలకు దాదాపు అన్ని వార్డుల ఫలితాలు వెల్లడిస్తామన్నారు. మొత్తం 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశామని, లెక్కింపు కేంద్రాల్లోకి కేవలం ప్రింట్‌ విూడియాకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలిపారు. 5గంటలకన్నా ముందే ఎవరైనా ఫలితాలు వెల్లడిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్‌కు ముందు మాక్‌ కౌంటింగ్‌ను చేపడతామన్నారు. కౌంటింగ్‌ సమయంలో మొదట ప్రింట్‌ విూడియాను మాత్రమే అనుమతిస్తామని తర్వాత ఎలక్ట్రానిక్‌ విూడియాను అనుమతిస్తామని తెలిపారు.  పురానాపూల్‌ డివిజన్‌లో రీపోలింగ్‌ ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఎలక్ట్రానికి విూడియా వల్ల సమాచారం లీక్‌ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందుకే వారిని తొలుత అనుమతించబోమని అన్నారు. సెల్‌ఫోన్‌లను కూడా కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతించమని తెలిపారు. ఏజెంట్లతోపాటు ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని వివరించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, కౌంటింగ్‌ ప్రారంభమైన మొదటి అర్ధగంట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. తొలి రౌండ్‌లోనే లెక్కింపు ఆలస్యం అవుతుందని, మిగతా రౌండ్‌లలో లెక్కింపు వేగంగా జరుగుతుందని వివరించారు. సాయంత్రం 5 గంటల తర్వాతే ఫలితాల వెల్లడి ఉంటుందని వివరించారు. కౌంటింగ్‌ ప్రారంభమైన నాలుగు గంటల్లో ఫలితాలు పూర్తిగా వెలువడుతాయని తెలిపారు.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, పార్టీల నాయకులు ఎవరూ అక్కడకు రావద్దని సూచించారు. కేవలం పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.పురానాపూల్‌ డివిజన్‌లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రీపోలింగ్‌ జరుగుతుందన్నారు. ఓటర్లను స్లిప్‌లు అడగవద్దని, ఈసారి మధ్య వేలుకు సిరా గుర్తు వేయాల్సిందిగా సిబ్బందికి సూచించినట్లు పేర్కొన్నారు. డివిజన్‌లో మొత్తం 34,400 ఓటర్లు ఉండగా, 200మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు కమిషనర్‌ వెల్లడించారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులు వచ్చిన రెండు గంటల్లో ఫలితం వెలువడుతుందని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు.

భారీగా ఏర్పాట్లు..పోలీస్‌ బందోబస్తు

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిహెచ్‌ఎంసి భారీగా ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరిగే  కేంద్రాల వద్ద ఏర్పాట్లను చేసింది. అయితే పురానాఫూ/- డివిజన్‌ రీపోలింగ్‌ కారణంగా ఉదయం ప్రారంభం కావాల్సిన కౌటింగ్‌ను సాయంత్రం 4 గంటలకు చేపట్టనున్నట్లు ప్రకటించారు.  పురానాపూల్‌లోని 36 కేంద్రాల్లో  శుక్రవారం  రీపోలింగ్‌ నిర్వహించనున్నారు.  ఈ కారణంగా కౌంటింగ్‌ను సాయంత్రానికి వాయిదా వేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌  జనార్ధన్‌  రెడ్డి పేర్కొన్నారు. పురానాపూల్‌ డివిజన్‌లో రీపోలింగ్‌ దృష్ట్యా గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా వేసినట్లు జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో  పురానాపూల్‌ డివిజన్‌లో 36 కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తామని వెల్లడించారు. 5 గంటలకల్లా తొలి ఫలితం వస్తుందని ఆయన తెలిపారు. ఇవిఎంలే కనుక రాత్రి 8కల్లా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో 45.25శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇకపోతే  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ సురేంద్ర మోహన్‌ వెల్లడించారు. ఈ నెల 5న ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్‌ కోసం 88 హాళ్లు, 970 టేబుళ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 1,154 కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియామకం చేశామన్నారు. ఇక మూడు వేల పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయని చెప్పారు. బల్దియాలోని వివిధ ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి వసతులను బట్టి 7 నుంచి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు.  ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను పూర్తి చేసిన తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. 150 డివిజన్ల పరిధిలో 45.27 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాస్తవానికి ఈ దఫా పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు పలు చర్యలు చేపట్టారు. ఇంటింటికీ పోలింగ్‌ చీటీలను పంపిణీ చేయడంతోపాటు మొబైల్‌యాప్‌, ఆన్‌లైన్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇంత జరిగినా కూడా పోలింగ్‌ శాతాన్ని మాత్రం పెంచలేకపోయారు. చార్మినార్‌ సర్కిళ్ల పరిధిలో అత్యల్ప పోలింగ్‌ శాతం నమోదైంది.  మరోవైపు పటాన్‌చెరు సర్కిల్‌ పరిధిలో అన్ని సర్కిళ్లలోనూ పోలింగ్‌ శాతం అధికంగా ఉంది. ఇక్కడ మూడు డివిజన్లు ఉన్నప్పటికీ అన్ని చోట్లా కూడా పోలింగ్‌ 50 శాతానికిపైగానే నమోదయ్యాయి. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినప్పటికీ నామమాత్రంగానే ఫలించాయి. గతంతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికలో పోలింగ్‌ శాతం పెద్దగా పెరగకపోవడంపై అధికారులు విశ్లేషిస్తున్నారు.రాజేంద్రనగర్‌ డివిజన్‌ పరిధిలో ప్రజలు అత్యధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకోగా అత్యల్పంగా విజయ్‌నగర్‌ కాలనీ వాసులు ఓట్లేశారు.  2009 ఎన్నికల్లో 42.92శాతం పోలింగ్‌ నమోదవ్వగా… ఈసారి కాస్త మెరుగైనట్లు అధికారులు తెలిపారు. ఎర్రగడ్డ డివిజన్‌లో అత్యధికంగా 59.19 శాతం, అత్యల్పంగా మెహదీపట్నంలో 34.28 శాతం, విజయనగర్‌ కాలనీలో 34.51శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధిక పోలింగ్‌ నమోదైన డివిజన్లలో  ఎర్రగడ్డ- 59.19 , రామచంద్రాపురం- 58.30 , చర్లపల్లి- 57, రామాంతపూర్‌- 56.62 ,గోల్నాక- 55.03, పురానాపూల్‌- 54.04 గా ఉంది.  జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు 5వ తేదీ జరుగనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. లెక్కింపు కేంద్రాల్లోని స్ట్రారగ్‌ రూంల్లో ఈవీఎంలను భద్రపర్చడంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జంట కమిషనరేట్ల పరిధిలో 24 లెక్కింపు కేంద్రాల్లో మూడంచెల నిరంతర భద్రత అమలు చేస్తున్నారు. సీసీ కెమెరాలతో ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. లెక్కింపు సందర్భంగా జంట నగరాల్లో ఎక్కడా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని, బాణసంచా కాల్చవద్దని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లెక్కింపు కేంద్రానికి కి.విూ. దూరంలో అయిదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడరాదని, మైక్‌లు వినియోగించి ప్రసంగాలు చేయరాదని పేర్కొన్నారు. సైబరాబాద్‌లోనూ లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి ఇన్‌ఛార్జి డీసీపీ రాంచంద్రారెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు ఓట్ల లెక్కింపునకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.కాగా నగర పాలక సంస్థ  కౌంటింగ్‌ శుక్రవారం సాయంత్రం ప్రారంభం కానుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలయ్యింది. ఎవరికి వారు తామే గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు.  మొత్తం 150 డివిజన్లలో అభ్యర్థులు ఫలితాలపై ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. 1,333 మంది అభ్యర్థుల భవితవ్యం 5న తేలనుంది. ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజలు తీవ్ర ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. టిఆర్‌ఎస్‌ మొత్తం 150 స్థానాల్లో పోటీ చేసి ప్రచారంలోనూ ముందుంది. ఇకపోతే టిడిపి, బిజెపి ఉమ్మడిగా పోటీ చేశాయి. అలాగేకాంగ్రెస్‌ ఒంటరిపోరు చేసింది. ఎంఐఎం ప్రధానంగా పాతబస్తీకే పరిమితం అయి 65 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్తిగా యువకుడైన విక్రమ్‌ గౌడ్‌ పేరును ముందే ప్రకటించింది. ఇతరపార్టీలు ఈ ప్రయోగం చేయలేదు. మంగళవారం రాత్రి పోలింగ్‌ ముగిసాక 45శాతం నమోదయినట్లు వెల్లడించారు. తరవాత పూర్తిగా వివరాలు అందాక కొంత పెరిగిందన్నారు. పోలింగ్‌ శాతం తక్కువగా ఉండటం ఎవరికి లాభించనుందో ఎవరికి దెబ్బకొట్టనుందో అన్నది కౌంటింగ్‌ పూర్తయ్యాక తెలియనుంది. సర్వేలన్నీ టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండడంతో కారు గుర్తుతో పోటీ చేసిన అబ్యర్థులుల ధీమాతో ఉన్నారు. ఎవరికి వారు తాముకార్పోరేటర్‌ కానున్నామని ప్రచారం చేసుకుంటున్నారు.  బల్దియా పరిధిలో లెక్కింపు కోసం 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రి 4 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం సర్వం సిద్ధం చేశారు.  హైదరాబాద్‌ పరిధిలోని అనేక ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం చాలా తక్కువగా నమోదైంది. మొత్తం 84 డివిజన్లు ఉన్నాయి. 18 డివిజన్ల పరిధిలో 40శాతం పోలింగ్‌ నమోదు కాలేదు. అత్యల్పంగా విజయ్‌నగర్‌ కాలనీలోనే పోలింగ్‌ జరిగింది. అతి తక్కువ పోలింగ్‌ శాతం నమోదైన డివిజన్లను పరిశీలిస్తే అందులో అత్యధికశాతం హైదరాబాద్‌ పరిధిలో ఉన్నడివిజన్లలోనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు తక్కువ పోలింగ్‌ ఎవరికి చేటు తెస్తుందోనని నేతలు ఆలోచిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం గణనీయంగా జరిగింది. 2007లో హైదరాబాద్‌కు చుట్టుపక్కల ఉన్న 12 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేశారు. గతంలో ఇక్కడ 50 డివిజన్లు ఉండగా ఇప్పుడు 63కి చేరుకున్నాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకొచ్చారు. శివారు డివిజన్లలో కేవలం ఆరు చోట్ల మాత్రమే 40 శాతంలోపు మాత్రమే పోలింగ్‌ జరిగింది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ 40 శాతానికిపైగానే పోలింగ్‌ నమోదైంది. చర్లపల్లిలో 57, డా.ఏఎస్‌రావునగర్‌లో 55.86, రామంతాపూర్‌లో 56.65, రామచంద్రాపురంలో 58.30, పటాన్‌చెరులో 54.13 శాతం ఇలా ఎక్కడ చూసినా కూడా పోలింగ్‌ శాతం భారీగానే ఉంది.