క్షణం చర్చించకుండా శాసనసభ జనవరి 3కు వాయిదా
మండిపడ్డ తెలంగాణ సభ్యులు
సీఎం చాంబర్ ఎదుట నిరసన
హైదరాబాద్, డిసెంబర్ 19 (జనంసాక్షి) :
క్షణం కూడా చర్చించకుండా శాసనసభ, శాసన మండలి జనవరి మూడో తేదీకి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ, శాసనమండలి వాయిదాల పరంపర గురవారం కూడా కొనసాగింది. తెలంగాణపై ఎలాంటి చర్చ మొదలు కాకుండానే ఈ యేడాది శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఇక వచ్చేయేడు ప్రారంభంలో మళ్లీ మొదలు కానున్నాయి. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈనెల 12న ప్రారరంభమైన సమావేశాలు తొలిరోజు మండేలాకు నివాళి అర్పించాయి. తరవాత చర్చకు ఆస్కారం ఉన్నా ప్రారంభం కాలేదు. సోమవారం నాడు విభజన బిల్లును స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశ పెట్టారు. సెక్రటరీ రాజాసదారం దీనిని చదవి వినిపించారు. ఇక ఆనాటి నుంచి ఎలాంటి చర్చ జరగలేదు. 17న బీఏసీ సమావేశంలో చర్చకు అంగీకరించినా ముందుకు సాగలేదు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు చర్చ జరక్కుండా అడ్డుకోవడంతో ముందుకు కదలలేదు. దీంతో ఉభయసభల సమావేశాలు తిరిగి కొత్త సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. జనవరి 3 వరకు శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. తదుపరి సమావేశాలు జనవరి 3 నుంచి 10 వరకు మొదటి విడత సమావేశాలు, జనవరి 5న సెలవు దినం, జనవరి 16నుంచి 23వరకు రెండోవిడత సమావేశాలు ఉంటాయి. ఇందులో 1, 19న సెలవులు కాగా మొత్తం 13 రోజులు సమావేశాలు జరగనున్నాయి. శాసనమండలి కూడా జనవరి 3వ తేదికి వాయిదా పడింది. ఇవే తేదిల్లో శాసనమండలి సమావేశాలు కూడా జరగనున్నాయి. గురువారంతో ఈ ఏటి శాసనసభ సమావేశాలు ముగిశాయి. రాష్ట్ర శాసనసభ సమావేశాలను 2014 జనవరి 3వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు సభాపతి నాదెండ్ల మనోహర్ గురువారం మధ్యాహ్నం ప్రకటించారు. జనవరి 3 నుంచి 23వ తేదీవరకు రెండువిడతలుగా నిర్వహించనున్న సమావేశాల షెడ్యూల్‌ను స్పీకర్ ప్రకటించారు. జనవరి 3 నుంచి 10 వరకు తొలివిడత సమావేశాల్లో జనవరి 5న సెలవుదినం. జనవరి 16 నుంచి 23 వరకు జరిగే రెండో విడత సమావేశాల్లో 18, 19 తేదీలు సెలవుదినాలు. జనవరిలో మొత్తం 13 రోజులు శాసనసభ సమావేశాలు జరుగుతాయి. శాసనమండలి కూడా జనవరి 3 వరకు వాయిదా పడింది. ఇరుప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలు మండలి సమావేశంలో ఆందోళన కొనసాగించడంతో మండలిలో వాయిదాలపర్వం కొనసాగింది. చివరికి సమావేశాలను జనవరి మూడు వరకూ వాయిదా వేస్తూ ఛైర్మన్ చక్రపాణి ప్రకటన చేశారు. అంతకుముందు మండలిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించారు.చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకో గలుగుతామని ముఖ్యమంత్రి అన్నారు. సున్నితమైన అంశం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకుంటే ఇబ్బందులు రావన్నారు. చర్చ ఏ విధంగా జరగాలన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదని, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా చర్చ జరిగిందో అధ్యయనం చేసి స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందన్నారు. నిబంధనలకనుగుణంగా చర్చ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించి రాష్ట్రపతి పంపిన బిల్లు చర్చకు రాకుండా అడ్డుపడ్డారని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. శాసనసభలో చర్చ జరగకుండా కాలయాపన చేయడాన్ని వ్యతిరేకిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సభాపతికి తెదేపా తెలంగాణ ఫోరం నేతలు లేఖ రాశారు. ఆంధప్రదేశ్ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై ఈ నెలాఖరులోగా శాసనసభలో చర్చను ముగించాలని, సమయం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
శాసనమండలిలోనూ..
శాసనమండలిలోనూ వాయిదాలపర్వం కొనసాగింది. 12వ తేదీన సంతాప తీర్మానాలకే పరిమితం. శుక్రవారం ఉదయం మండలి సమావేశమైంది. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. టీడీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. నన్నపనేని రాజకుమారి, శమంతకమణి, టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఛైర్మన్ చక్రపాణి నచ్చ జెప్పినప్పటికీ పోడియం వద్దే ఉండిపోయారు. టిఆర్‌ఎస్ సభ్యుడు కె.స్వామిగౌడ్, పాటూరి సుధాకర్‌రెడ్డి నినాదాలు చేశారు. సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితి యథాతథంగా ఉండడంతో మరోసారి వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైంది. చైర్మన్ ఆదేశం మేరకు ఎపి మునిసిపల్ సవరణ బిల్లును మంత్రి మహిధర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. గందరగోళం నెలకొనడంతో సోమవారానికి డెప్యూటీ చైర్మన్ వాయిదా వేశారు. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్ చక్రపాణి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. కొందరు ఎమ్మెల్సీలు సమైక్య, తెలంగాణ నినాదాలు చేశారు. మండలిలో గందరగోళం నెలకొనడంతో మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 10.15గంటలకు శాసనమండలి బీఏసీ సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్య్వవస్థీకరణ ముసాయిదా బిల్లుపై చర్చించాలని, అది కూడా అసెంబ్లీ బిఎసి నిర్ణయించిన తేదీల ప్రకారమే నిర్వహించాలని మండలి బిఎసి నిర్ణయించింది. బుధవారం కూడా వాయిదాల పరంపర కొనసాగింది. విభజన బిల్లుపై చర్చ సాగలేదు. గురువారానికి వాయిదా పడింది. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించాలని టిఆర్‌ఎస్, సమైక్యాంధ్రపై తీర్మానం చేయాలని తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలుచేశారు. చర్చకు సహకరించాలని చైర్మన్ పదే పదే విజ్ఞప్తి చేశారు.గంటపాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో గురువారానికి వాయిదా వేశారు. గురువారం రెండుమార్లు వాయిదా పడింది. ఇటీవల మరణించిన ఎమ్మెల్సీలకు సంతాపం తెలిపింది. అనంతరం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించేది..ఎంత సమయం అన్నది తెలియజేయాలని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కోరారు. మరో ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడేందుకు యత్నించారు. సమైక్య, తెలంగాణ నినాదాలు చోటు చేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. గంటపాటు వాయిదా వేశారు.. ఆ తర్వాత జనవరి 3వ తేదీకి వాయిదా వేశారు.
బిల్లుపై చర్చేవిధంగా ఉండాలో డైరెక్షన్స్‌లేవు : శాసనమండలిలో సీఎం
రాష్ట్ర విభజన బిల్లుపై ఏవిధంగా చర్చించాలి, ఎలా ప్రారంభం కావాలనే అంశంపై అసెంబ్లీ సెక్రటేరియట్ సరైన డైరెక్షన్స్ ఇవ్వక పోవడం వల్లే అనిశ్చితి నెలకొందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శాసనమండలి సమాశంలో పాల్గొన్న సిఎం చైర్ అనుమతి తీసుకుని మాట్లాడుతూ ఉత్తర ప్రధేశ్, బీహార్ రాష్ట్రాల విభజన సమయంలో చేపట్టిన ప్రొసీడింగ్స్‌ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు. అయితే మధ్యలో టిడిపి నేత యనమల రామకృష్ణుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ సిఎం ఎక్కడో జరిగింది చెప్పాల్సినవసరం లేదని, సభలో ఎవరెన్నిగంటలు మాట్లాడాలో, ఏపార్టీకి ఎంత సమయం కేటాయిస్తున్నారు, అసలు సభ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పటి వరకు కొనసాగుతుందో స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుబట్టారు. మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగిందనేది తమ వద్ద కూడా పత్రాలున్నాయన్నారు. అందరు కలిసి సభను సజావుగా సాగేందుకు ప్రయత్నించాల్సినవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చైర్మనుద్దేశించి సలహాలివ్వడం కాదని సభను అడ్రస్ చేయాల్సి ఉందన్నారు. అనంతరం చైర్మన్ చక్రపాణి జోక్యం చేసుకుని కేవలం సలహాలు మాత్రమే ఇస్తున్నరని, దానిపై నిర్ణయం మనమే తీసుకుందామన్నారు. విభజన కాపీలు పరిశీలించాక పార్టీలకు సమయం కేటాయిస్తానన్నారు. రాజ్యాంగానికి లోబడి సభలో చర్చించాల్సి ఉందన్నారు. చర్చలకు ఫల వంతంగా కొనసాగాలన్నారు. ఇలాంటి విధానం మనకు అలవాటు లేదని, అనుభవం అంతకన్నా లేదన్నారు. ఇరు ప్రాంతాల వారు ఉద్రేకాలకు పోతూ విమర్శలు, ప్రతివిమర్శలకు పోతూ ప్రజల్లో వైషమ్యాలు పెంచుతున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. సున్నతమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సంయమనంతో ఉండాలన్నారు. ఏ ఒక్కరు కూడా ఉద్రేకాలకు పోవద్దన్నారు. ఎంత పెద్ద సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనిలో మూడో అభిప్రాయం లేనేలేదన్నారు. ఇతర రాష్టాల్రు వ్యవహరించిన తీరును ఓసారి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా సిఎం ఉత్తరాంచల్, జార్కంఢ్ విభజనలకు సంబందించిన ప్రతులను మండలి చైర్మన్‌కు అందించారు.ఈతరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ సభలో చర్చ ప్రారంభించాలని ఇలా అంటు న్నా డోలేదో సీమాంద్రకు చెందిన నన్నపనేని రాజకుమారిసహా ఎమ్మెల్సీలు పోడియం వద్దకు దూసుకెళ్లి జైసమైక్యాంధ్ర అంటూ నినాదులు చేశారు. దీంతో చైర్మన్ సభను గంటసేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈసమయంలో ఫ్లోర్‌లీడర్ల సమావేశం నిర్వహించి సమయాలు ప్రకటిద్దామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై శాసనమండలిలో గందరగోళం నెలకొంది. ఆయన ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సీఎం అప్పీల్లో స్పష్టత లేదని, సున్నితమైన అంశంపై చర్చ ఎప్పుడు, ఎంత సమయం జరుగుతుందో స్పష్టం ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు. దీనిపై క్లారిటీ ఇస్తే బాగుంటుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విభజన బిల్లుపై తొలిసారిగా చట్టసభలో మాట్లాడిన తీరుపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన సున్నితమైన సమస్య అని, ఎవరినీ నొప్పించకుండా చర్చ జరగాలన్నారు. సున్నితమైన సమస్యపై చర్చలో జాగ్రత్తగా మాట్లాడితే ఎలాంటి సమస్యలు రావని అన్నారు. వేరేచోట్ల విభజన ఎలా చేశారన్నది కూడా అందరూ అధ్యయనం చేయచాలన్నారు. అవసరం అయితే మళ్లీ బీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ ఎలా జరగాలన్నది సభాపతులు స్పష్టం చేయలేదని సీఎం మండలిలో అన్నారు. అయితే ముఖ్యమంత్రి అప్పీల్‌లో స్పష్టత లేదని, మండలి ఛైర్మన్‌కు సూచనలు చేసినట్లుగా ఉందని పేర్కొన్నారు. సున్నితమైన అంశంపై ఎలా వ్యవహరించాలో సీఎం స్పష్టత ఇస్తే బాగుండేదన్నారు. చర్చ ఎప్పుడు, ఎలా, ఎంతసమయం అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని యనమల కోరారు. అంతకుముందు సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో శాసనమండలి దద్ధరిల్లింది. మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో ¬రెత్తించారు. బిల్లుపై అభ్యంతరాలుంటే చర్చ సమయంలో చెప్పవచ్చని స్పీకర్ సూచించినప్పటికీ సభ్యులు పట్టించుకోలేదు.
సీఎం చాంబర్ ఎదుట తెలంగాణ నేతల ఆందోళన
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఎలాంటి చర్చ జరగకుండానే శాసన సభ, శాసనమండలి గురువారం వాయిదాపడడంతో టీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కావాలనే స్పీకర్ సభను వాయిదా వేవారని మండిపడ్డారు. సభను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. పోడియం ముందు వారు బైఠాయించారు. రాత్రంతా సభలోనే ఉండి దీక్ష చేసి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. స్పీకర్ తెలంగాన ప్రజల ఆకాంక్షలను కాలరాసారని మండిపడ్డారు. స్పీకర్, సిఎం కుమ్మక్కయి వాయిదాకు కుట్ర చేశారని ఈటెల రాజేందర్ అన్నారు. గతంలో రాష్ట్ర విభజనల సందర్భంగా మధ్యప్రదేశ్, బీహార్ శాసనసభల్లో కేవలం ఒకే ఒక రోజు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మూడు రోజులు, ఆంధప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మూడు రోజులు మాత్రం సభలో బిల్లుపై చర్చించారని, అలాంటి సంప్రదాయాన్నే ఇక్కడ పాటించాలని అన్నారు. అంతకు మించి ఎక్కువ రోజులు చర్చకు కేటాయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని స్పీకర్‌కు నివేదించామని అయినా తాము సహకరిస్తామన్నా వాయిదా వేయడం దారుమన్నారు. అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయడాన్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. బీఏసీ నిర్ణయాన్ని తుంగలో తొక్కి స్పీకర్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని, దీన్ని టీఆర్‌ఎస్ తీవ్రంగా గర్హిస్తోందన్నారు. అసెంబ్లీలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ వాయిదా నిర్ణయాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలమంతా సభలోనే భైఠాయించామని, రాత్రి కూడా అసెంబ్లీలోనే ఉండి దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. సెలవుదినాల్లో తప్ప ప్రతి రోజూ సభ జరగాలని, సభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలని బీఏసీలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా గట్టిగా డిమాండ్ చేశామని హరీశ్‌రావు తెలిపారు. సభను వాయిదా వేయాలని బీఏసీలో నిర్ణయించలేదని, బీఏసీలో నిర్ణయించిన ప్రకారమే సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ చేతిలో ఓ కాగితాన్ని పెట్టి సభను వాయిదా వేయడం అన్యాయమని హరీష్ అన్నారు. తెలంగాణ ప్రాంత సభ్యులు చర్చకు సహకరిస్తున్నా సభను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సీమాంధ్ర సభ్యులు ఓట్ల కోసమే నటిస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఏదైనా అంశపై చర్చను జరగాలని సభ్యులు డిమాండ్ చేస్తారు తప్ప చర్చను అడ్డుకోవడం సీమాంధ్ర ఎమ్మేల్యేలకే దక్కిందన్నారు. సభను అడ్డుకున్నంత మాత్రాన విభజన ఆగదని తేల్చి చెప్పారు. స్పీకర్ వైఖరి నిరసనగా తెలంగాణలో ఆందోళనలకు పిలుపునిచ్చారు. తెలంగాణపై చర్చను అడ్డుకుంటున్న విషయాన్ని తాము రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. సీమాంధ్ర నేతలు రాజకీయ ప్రాబల్యం కోసమే చర్చను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చర్చను అడ్డుకున్నా తెలంగాణను ఆపలేరన్నారు. కేంద్రానికి సీమాంధ్ర నేతల లేఖ తెలంగాణ ముసాయిదా బిల్లు విధివిధానాలపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రానికి సీమాంధ్ర ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఆర్థిక నివేదితక తదితర అంశాలు బిల్లుతో పాటు అందించాలని కోరారు. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్ర సమితి దొంగనాటకాలు ఆడుతోందని ఎర్రబెల్లి దయాకర రావు గురువారం మండిపడ్డారు. . తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. చంద్రబాబును విమర్శించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారన్నారు.