30 సార్లు ఉల్లంఘిస్తే వాహన రిజిస్ట్రేషన్‌ రద్దు

ఏడాదికి 30 సార్లు నిబంధనలు ఉల్లంఘిస్తే వారి వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని భావిస్తున్నారు పోలీసులు. ఎన్నిసార్లు చలానాలు వేసినా జరిమానాలు చెల్లించి మళ్లీ ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించేద్దామంటే ఇక కుదరదు. గత నాలుగైదేళ్లుగా నిబంధనలు ఉల్లంఘించే వారి వాహనాల రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా రద్దు చేయాలన్న యోచనలో ఉన్నారు హైదరాబాద్‌ టాఫ్రిక్‌ పోలీసు అధికారులు. హైదరాబాద్‌ మహానగరంలో 50 లక్షల వాహనాలు ఉన్నాయి.

రోజూ వాహనదారులపై నగర ట్రాఫిక్‌ పోలీసులు 10 వేల ఉల్లంఘనలకు సంబంధించిన చలానాలాను వేస్తున్నారు. అంటే ఏడాదికి సుమారు 30 లక్షల వరకు చలానాలు ఇళ్లకు చేరుతున్నాయి. వాహనదారులపై ఛార్జి షీట్లు దాఖలు చేస్తుండటంతో గత ఏడాది నుంచి చలానాలను చెల్లించే వారికి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికీ చలానాలను చెల్లించని వారి సంఖ్య 20 లక్షలకు చేరిందని చెపుతున్నారు టాఫ్రిక్‌ పోలీసు అధికారులు. వాహనదారుల్లో ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఎన్ని సార్లు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించారు, ఇప్పటి వరకు ఎన్ని చలానాలను చెల్లించారన్న దానిపై ఇటీవల పరిశీలించారు ట్రాఫిక్‌ పోలీసులు. అతిగా జరిమానాలు చెల్లించే, అధికంగా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిని గుర్తించడానికి కసరత్తు చేస్తున్నారు పోలీసులు. ఏడాదికి 30 సార్లు పోలీసులకు పట్టుబడితే వారి వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని భావిస్తున్నారు. గత నాలుగేళ్ల సంబంధిత వాహనదారుని చరిత్రను విశ్లేషణ చేసి అప్పటి నుంచి అధికంగా నిబంధనలను అతిక్రమించే వారిపై ముందుగా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు టాఫ్రిక్‌ పోలీసులు. దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని రోజులపాటు పెద్దఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించారు. అనంతరం ఈ నిబంధనను అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

తాజాగా పాయింట్ల విధానం అమలులోకి వచ్చిన తరువాత రోజుకు 500 మంది ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లపైకి వచ్చి జరిమానాలు విధించడమే కాకుండా పాయింట్లను కూడా నమోదు చేస్తున్నారు. ఒక వైపు సీసీ కెమెరాలు మరోవైపు పోలీసుల తనిఖీలతో ఏ మాత్రం నిబంధనలు ఉల్లంఘించినా జరిమానాల వాత పడుతోంది. దీంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండకపోతే వారు నడిపే వాహనం రిజిస్ట్రేషన్‌ రద్దు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. దీనితో వాహనదారులు సైతం అప్రమత్తమయ్యారు.