31 వరకు ఐటి రిటర్న్స్‌ దాఖలు గడువు

న్యూఢిల్లీ,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి ఇచ్చిన గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ)  ప్రకటన జారీ చేసింది. ఐటీ రిటర్న్‌ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును 31 అక్టోబరు 2018 వరకు పొడిగిస్తున్నారు. కొన్ని ప్రత్యేక విభాగాలకు చెందిన పన్ను చెల్లింపుదారులకు ఈ అవకాశం వర్తిస్తుంది’ అని సీబీడీటీ ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు ఆడిట్‌ రిపోర్టు పరిశీలన తుది గడువును కూడా అక్టోబరు 31 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఐటీ రిటర్న్‌ దాఖలు గడువును పెంచడం ఇది నాలుగో సారి.  2017-18 (అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2018-19)కి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి తొలుత ఆగస్టు 31 వరకు గడువును పొడిగించారు. ఆ తర్వాత మరోసారి తేదీని పొడిగించి సెప్టెంబరు 30 లోపు ఐటీ రిటర్న్‌ దాఖలు చేయాల్సిందిగా సీబీడీటీ ప్రకటించింది. మళ్లీ ఆ తేదీని అక్టోబరు 15 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ తేదీని మార్చింది. అక్టోబరు 31 వరకు గడువు ఇస్తున్నట్లు తెలియజేసింది.