340 బస్తాల రేషన్‌బియ్యం స్వాధీనం
గుంటూరు, ఆగస్టు 2 : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని నాదెండ్ల పోలీసులు గురువారం పట్టుకొన్నారు. ముందస్తు సమాచారంతో, ఎస్.ఐ సాంబశివరావు గణపవరం గ్రామపరిధిలో జాతీయ రహదారిపై వెళుతున్న లారీని పట్టుకొన్నారు. ఇంతకు ముందు కూడా 300 బస్తాలు బియ్యం కలిగిన లారీని పట్టుకొన్నామని ఎస్‌ఐ అన్నారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్ నవీన్, క్లీనర్ నరేష్‌ల నుంచి నకిలీ బిల్లులను స్వాదీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకొన్నారు. నకిలీ బిల్లుల ప్రకారం జోన్నల పేరుతో ఈ బియ్యాన్ని కాకినాడకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కడపజిల్లా పోరుమామిళ్ళకు చెందిన లారీ ప్రొప్రైటర్ సుబ్బారాయుడు సూచనల మేరకు పొదిలి సమీపంలోని ఒక గ్రామం వద్ద మరో లారీ నుంచి బియ్యంబస్తాలను లారీలోకి ఎక్కించామని డ్రైవర్ తెలిపారు. బియ్యంలారీ గణపవరానికి చేరుకోగానే పోలీసులు పట్టుకున్నారు.