4 నెలల గరిష్టానికి దేశీయ మార్కెట్లు

ముంబై : గురువారం ట్రేడింగ్ లో స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, నేడు(శుక్రవారం) ఫుల్ జోష్ ను కొనసాగిస్తున్నాయి. మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే ఒక్కసారిగా 225 పాయింట్లు లాభపడిన  బీఎస్ఈ సెన్సెక్స్ 26 వేల మార్కును దాటింది. ప్రస్తుతం 85.90 పాయింట్ల లాభాలతో 25,930గా కొనసాగుతోంది. నాలుగు నెలల అనంతరం సెన్సెక్స్ 26 వేల గరిష్ట స్థాయిని తాకడం ఇదే మొదటిసారి. నిఫ్టీ సైతం 40 పాయింట్ల లాభంతో 7,931 వద్ద నమోదవుతోంది. ప్రధానంగా  ఆయిల్, బ్యాంకింక్ రంగ షేర్లు మార్కెట్ నులీడ్ చేస్తున్నాయి.

రిలయన్స్, టీసీఎస్, మారుతీ సుజుకీ, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ, టాటా మెటార్స్, యాక్సిస్ బ్యాంకు, గైల్ షేర్లు లాభాల్లో నడుస్తుండగా.. టాటా స్టీల్, విప్రో, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. గురువారం విడుదలచేసిన క్యూ 4 ఫలితాల్లో  విప్రో  లాభాలు స్వల్పంగా  తగ్గడంతో, మార్కెట్లో ఈ  షేరు 6శాతానికి  పడిపోయింది.  మరోవైపు బంగారం షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.