5న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం


– శబరిమలలో భారీ భద్రత
– 5000మంది పోలీసుల మోహరింపు..!
పంబా, నవంబర్‌3(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్ప ఆలయం ఈనెల 5వ తేదీన మళ్లీ తెరుచుకోనుంది. ‘చితిర అట్ట విశేషం’ సందర్భంగా అయ్యప్ప ఆలయాన్ని 5వ తేదీ  సాయంత్రం 5.30 గంటలకు తెరిచి.. 6వ తేదీ రాత్రి 10.30 గంటలకు మూసివేస్తారు. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 5000 మంది పోలీసులను రంగంలోకి దించారు. ఇక.. నీలక్కళ్‌, ఇల్లువంగళ్‌, పంబలో శనివారం నుంచి 144సెక్షన్‌ అమలుకానుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో కేరళలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం, సన్నిధానంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలను భక్తులు అడ్డుకోవడంతో కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అందుకే నిషేదాజ్ఞలు విధించింది. విూడియా ప్రతినిధులు, భక్తులు తప్ప మిగతావారిని నిలక్కల్‌ నుంచి పంబకు అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. మొత్తం ఇద్దరు ఐజీలు, ఐదుగురు ఎస్పీలు, పది మంది డీఎస్పీలను నిలక్కల్‌, పంబ, సన్నిధానం, వడస్సేరికర ప్రాంతాల్లో విధులకు కేటాయించారు.