50 ఏళ్లుగా కృష్ణాడెల్టాకు సాగునీరు తెలంగాణకు కన్నీరు

వెంటనే సాగర్‌ ఆయకట్టు నీటిని సీమాంధ్రకు ఆపండి
సీఎంను భజనలో ఉత్తమ్‌ కుమార్‌, ముఖ్యమంత్రి కావాలని జానా
తెలంగాణ ఆకాంక్ష వారికి పట్టదు
30 నుంచి మహోద్యమానికి సిద్ధం కండి : కోదండరామ్‌

సుల్తానాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : యాభై ఏళ్లుగా కృష్ణా డెల్టాకు సాగునీళ్లిచ్చి, పాలకులు తెలంగాణతో కన్నీళ్లు పెట్టిస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. సాగర్‌జలాల విడుదలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. సోమవారం సుల్తానాబాద్‌ మండలంలోని చిన్నబొంకూర్‌ గ్రామంలో ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌తో కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం సుల్తానాబాద్‌ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 56 ఏళ్లుగా నాగార్జునసాగర్‌ నుండి కృష్ణా జలాలను పాలకులు దోపిడి చేసి ఆంధ్రకు చేరవేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. హైదారాబాద్‌, నల్గొండకు తాగునీటి ఇవ్వకుండా, ఇక్కడి ప్రజలు నీళ్ల కోసం అల్లాడే పరిస్థితి కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో 69ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విత్తనాలు, ఎరువులను లాటరీ పద్దతిన అందించే దౌర్భాగ్యానికి కిరణ్‌ ప్రభుత్వం తీసుకవచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ నీటి విడుదల సజావుగానే ఉందనడం హాస్సాస్పదమన్నారు. జానారెడ్డి సీఎం పదవి కోసమే పాలకులకు వత్తాసు పలుకుతున్నాడని కోదండరాం విమర్శించారు. సెప్టెంబర్‌ 30 నుండి మలి దశ ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి, మండల స్థాయి జేఏసీలను ఏర్పాటు చేసి ఉద్యమ తీవ్రతను పెంచుతామని వివరించారు. ఆయన వెంట జేఏసీ, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో చోటు లేదు : కేటీఆర్‌
సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో చోటు లేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు తెలంగాణకు అనుకూలమని హైదారాబాద్‌ వెళ్లాక ఆంధ్రపాలకుల మోచేతినీళ్లు తాగుతున్నారని విమర్శించారు. మెడికల్‌ సీట్లలో అన్యాయం జరగడానికి వాళ్ల చేతగానితనమే కారణమని మండిపడ్డారు. చంద్రబాబు జపం చేస్తున్న టీడీపీ నాయకులకు తెలంగాణలో తిరిగే హక్కు లేదన్నారు. పెద్దపల్లి టీడీపీ ఎమ్మెల్యే విజయరమణరావు తెలంగాణపై చిత్తశుద్ధ్ది ఉంటే వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబులా రాజీనామా చేసి వస్తే తెలంగాణ ప్రజలు గెలిపిస్తారని తెలిపారు. నిజంగా టీడీపీ ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, గంగుల కమలాకర్‌, విజయ్‌రమణరావుకు తెలంగాణపై అభిమానముంటే చంద్రబాబునాయుడుతో తెలంగాణపై లేఖ ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. కిరణ్‌సర్కార్‌ రైతు చైతన్య యాత్ర పేరిట మోసం చేస్తున్నదని ఆరోపించారు. విత్తనాలను పోలీస్‌స్టేషన్‌లో పంచి పెట్టే సంస్కృతికి తెర లేపిన ఘనత కిరణ్‌ సర్కార్‌కే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు నల్లా మనోహర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, వైకుంఠపతి, ఐల రమేశ్‌, బైరగోని ప్రభాకర్‌, దయాకర్‌, సంపత్‌, సంజీవ్‌, శ్రీను, గట్టు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.