50 మందికి ఆవిర్భావ పురస్కారాలు
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. మొత్తం 32 రంగాల నుంచి 50 మందిని రాష్ట్రస్థాయి అవార్డుల కమిటీ ఎంపిక చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వీరిని జ్ఞాపిక, నగదుతో సత్కరిస్తుంది. అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల నగదు బహుమతిని సీఎం కేసీఆర్ ప్రదానం చేస్తారు.
ఉత్తమ గ్రామ పంచాయతీగా కరీంనగర్ జిల్లా చందుర్తి, ఉత్తమ మండలంగా మెదక్ జిల్లా సిద్దిపేట, ఉత్తమ మున్సిపాలిటీగా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలను అవార్డుల కమిటీ ఎంపిక చేసింది.
హైదరాబాద్ కు చెందిన వేదపండితుడు కె. పాండురంగాచార్య, సాహితీవేత్తలు ముదిగొండ వీరభద్రయ్య, గూడ అంజయ్య, సల్లావుద్దీన్ సయ్యద్, నల్లగొండ జిల్లాకు చెందిన సుంకిరెడ్డి నారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన పోల్కంపల్లి శాంతాదేవి, కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దింటి అశోక్ కుమార్, ఆధ్యాత్మిక వేత్తలు ఆర్చ్ బిషప్ తుమ్మబాల, మక్కా మసీదు ఇమాం జనాబ్ మహమ్మద్ ఉస్మాన్, రాష్ట్ర ప్రభుత్వ లోగో రూపకర్త ఏలె లక్ష్మణ్, అమరవీరుల స్థూప నిర్మాత ఎక్కా యాదగిరిరావు, ఉత్తమ కళాకారులు కె. లక్ష్మాగౌడ్, కళాకృష్ణ, అలేఖ్య పుంజాల, ఉత్తమ జర్నలిస్ట్ టంకశాల అశోక్, ఉత్తమ ఎలక్ట్రానిక్ విూడియా జర్నలిస్ట్ డాక్టర్ పసునూరి రవీందర్, ఉత్తమ సంగీతకారులు హైదరాబాద్ బ్రదర్స్, గజల్ గాయకుడు విఠల్ రావు, ఉద్యమ సంగీతంలో కరీంనగర్ కు చెందిన జి.ఎల్. నామ్దేవ్, వరంగల్ కు చెందిన సంస్కృత పండితుడు ఆచార్య నల్లాన్ చక్రవర్తుల రఘునాథచార్యులు, వరంగల్ జిల్లాకు చెందిన చుక్కా సత్తయ్య లకు అవార్డులను ప్రకటించింది.